KCR | 29 నుంచి అసెంబ్లీ.. హాజ‌రుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..!

KCR | ఈ నెల 29 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల‌కు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కానున్న‌ట్లు స‌మాచారం.

  • By: raj |    telangana |    Published on : Dec 27, 2025 8:50 AM IST
KCR | 29 నుంచి అసెంబ్లీ.. హాజ‌రుకానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..!

KCR | హైద‌రాబాద్ : ఈ నెల 29 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల‌కు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కానున్న‌ట్లు స‌మాచారం. అసెంబ్లీ సెష‌న్స్‌కు హాజ‌రు కావాల‌ని నిన్న ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

నిన్న నిర్వ‌హించిన స‌మావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశంపై అటు అసెంబ్లీలో, ఇటు క్షేత్రస్థాయిలో బలంగా పోరాడుదామని కేడర్‌కు సూచించారు. మహబూబ్‌నగర్ సమీప మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ స‌మావేశాలు 15 రోజులు ఉండేలా అధికార ప‌క్షాన్ని డిమాండ్ చేయాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వ‌ర‌కు తెలంగాణ‌కు ఎప్పుడూ ద్రోహ‌మే చేస్తుంది. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్‌కు త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ప‌ట్టింపు ఉండ‌దు. నీళ్ల ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిని ఎండ‌గ‌డుదాం. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఉద్య‌మాలు నిర్మిద్దాం. తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదిక‌గా వివ‌రిద్దాం. నీటి హ‌క్కుల్ని ప‌రిర‌క్షించుకుందాం. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌పై బీఆర్ఎస్ నుంచి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చేందుకు ప‌ట్టుప‌డ‌దాం. అధికార ప‌క్షం ఎలా స్పందిస్తుందో చూద్దాం.. దానికి అనుగుణంగా ముందుకు వెళ్దాం అని పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ సూచించిన‌ట్లు తెలిసింది.

ఈ స‌మావేశానికి ఉమ్మ‌డి పాల‌మూరు, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ నేత‌ల‌తో పాటు కేటీఆర్, హ‌రీశ్‌రావు, మాజీ మంత్రులు హాజ‌ర‌య్యారు.