రసాభాసగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. తగిన సంఖ్యాబలం లేకున్న మేయర్ విజయలక్ష్మీగా కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆరెస్ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు

విధాత, హైదరాబాద్ : ప్రజా సమస్యలపై చర్చించాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారగా ఆధ్యంతం సభ్యుల ఆందోళనల మధ్య రసాభాసతో కొనసాగి చివరకు నిరవధికంగా వాయిదా పడింది. తొలుత మేయర్‌గా విజయలక్ష్మీ కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆరెస్ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. ఆమెకు తగిన సంఖ్యాబలం లేదని, మేయర్ పోడియంను చుట్టుముట్టి ఆమె రాజీనామాకు డిమాండ్ చేశారు. మేయర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీఆరెస్ సభ్యుల నిరసనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మీ ఫిరాయింపులను గతంలో బీఆరెస్ పార్టీనే ప్రోత్సహించిందని వ్యాఖ్యానించారు. నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్‌కు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆరెస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాదోపవాదాలతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశాన్ని మేయర్ కాసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన బీఆరెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరిగి కౌన్సిల్ సమావేశమైనప్పటికి మళ్లీ కాంగ్రెస్, బీఆరెస్ సభ్యుల మధ్య వాగ్వివాదం కొనసాగింది.
దాడి చేసుకున్న కార్పొరేటర్లు
కౌన్సిల్ తిరిగి సమావేశమైన క్రమంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల కొట్లాటతో మరోసారి కౌన్సిల్ వాయిదా పడింది. ఈ దాడి ఘటనపై కౌన్సిల్ హాల్‌లోనే బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలకు దిగారు. తమ కార్పొరేటర్లపై దాడి చేసిన ఎంఐఎం కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోడియం ముందు కూర్చుని బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కౌన్సిల్ హాల్ లోపల భారీగా మార్షల్స్ మోహరించారు. అటు కాంగ్రెస్.. ఇటు బీఆరెస్ కార్పొరేటర్లు.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు నిరసన వదలకపోవడంతో కౌన్సిల్‌ను కంట్రోల్ చేయలేక.. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సభను వాయిదా వేసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు వాటర్ వర్క్స్ ఎండీని కౌన్సిల్‌కు తీసుకురావాలని కార్పొరేటర్లు పట్టుబట్టారు. అనారోగ్యం కారణంగా ఎండీ అశోక్ రెడ్డి సమావేశానికి రాలేదు. వెంటనే ఆయనను పిలిపించాలని కమిషనర్‌ను మేయర్ ఆదేశించారు. అశోక్ రెడ్డితో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఫోన్‌లో మాట్లాడారు. జలమండలి పనితీరుపై బీఆరెస్, బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. ఈ వ్యవహారంపై కలుగజేసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కార్పొరేటర్లకు సారీ చెప్పారు. దీంతో కార్పొరేటర్లు కాస్త శాంతించారు.
బీఆరెస్ సభ్యుల తీరు మేయం విజయలక్ష్మీ మండిపాటు
జీహెచ్‌ఎంసీల కౌన్సిల్ సమావేశంలో తన రాజీనామా కోసం పట్టుబడుతూ ఎజెండా చర్చించుకుండా, కీలక తీర్మానాలు ఆమోదించకుండా బీఆరెస్ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు అడ్డుకోవడం సరికాదని మేయర్ గద్వాల విజయలక్ష్మీ మండిపడ్డారు. గతంలో టీడీపీ నుంచి బీఆరెస్‌లో చేరి మంత్రులైన వారు ఆనాడు వారి పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ఈ రోజు వారు ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆరెస్ సభ్యుల తీరుతో కౌన్సిల్ సమావేశం జరగకుండా విలువైన ప్రజాధనం వృధా అయ్యిందని విమర్శించారు.
బీఆరెస్ బాటలోనే కాంగ్రెస్ : ఈటల
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆరెస్, కాంగ్రెస్ కార్పోరేటర్ల మధ్య, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. బీజేపీ మహిళా కార్పోరేటర్లు ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే కాంగ్రెస్, ఎంఐఎం సభవ్యులు వారిపై దాడికి యత్నించారని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు, పదవులపై ఉన్న ధ్యాన ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. దీనికి ఇవాళ కౌన్సిల్‌లో జరిగిన ఘటనే నిదర్శనమని చెప్పారు. గత బీఆరెస్ హయాంలో జరిగినట్లుగానే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆరెస్ పార్టీ కూడా ఇదే తరహాలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసి ప్రజాగ్రహానికి గురైందని, కాంగ్రెస్ కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.