బండి సంజయ్‌ని భర్తరఫ్ చేయాలి :బీఆరెస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కేంద్ర హోం శాఖ సహాయ శాఖ బండి సంజయ్ ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, ఆయన కుమారుడు సాయి భగీరథ్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బేటీ బచావో అంటే ఇదేనా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పాలని అన్నారు.

విధాత, హైదరాబాద్:

కేంద్ర హోం శాఖ సహాయ శాఖ బండి సంజయ్ ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, ఆయన కుమారుడు సాయి భగీరథ్ పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన భేటీ బచావో అంటే ఇదేనా?  ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో మోదీ మహిళలకు సమాధానం చెప్పాలన్నారు. బేటీ బచావో… మహిళల రిజర్వేషన్ బిల్లు పెట్టిన అని ప్రగల్భాలు పలికుతున్న మోదీ.. బండి సాయి భగీరథ్ అకృత్యాల గురించి తెలంగాణ ప్రజలకు వివరించాలన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సైబరాబాద్ బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసు కమిషనర్.. మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ కేసులో బండి సంజయ్ కుమారుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కరీంనగర్ పోలీసు కమిషనర్ ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను భద్రపర్చాలని కోరారు.

బాధితురాలి తల్లిదండ్రులకు ప్రాణభయం

బాధితురాలి తల్లిదండ్రులకు కూడా బండి సంజయ్ నుండి ప్రాణభయం ఉందని, వారికి ఏం జరిగినా రాష్ట్ర పోలీసులదే బాధ్యత అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దేనికీ పనికి రాని అంశాలపై సిట్‌లు వేశారని, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని కాపాడే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి కుమారుడు సాయి భగీరథ్ అరాచకాలపై ఒక బిడ్డకు తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా మాట్లాడుతున్నానని ప్రవీణ్ తెలిపారు. బండి సంజయ్ కుమారుడిపై శుక్రవారం పోక్సో కేసు అత్యంత కష్టం మీద నమోదైందన్నారు. గతంలో బండి సంజయ్‌, ఆయన కుమారుడు మోదీని కలిసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కలిసే తిరిగామని భగీరథే చెప్పాడు

సాయి భగీరథ్ ఫిర్యాదు చేయగానే శుక్రవారం సాయంత్రం కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 308, 351 సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాయి భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదులో రకరకాల ఫ్యామిలీ ఫంక్షన్స్, స్నేహితులతో కలిసి జరిగిన పార్టీలకు, దేవాలయాలకు వెళ్లే క్రమంలో… ఒక మిత్రుడి ద్వారా అమ్మాయి పరిచయం అయినట్లు తెలిపారు. స్నేహం ముసుగులో కొన్ని పండుగలు, పార్టీలు, దేవాలయాలు విజయవాడ కనకదుర్గ అమ్మ వారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లామని ఆయనే వివరించారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని, అత్యాచార కేసులు పెడతామని, డబ్బులు అడిగితే రూ.50 వేలు ఇచ్చానని పేర్కొన్నారు. తర్వాత అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని? రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. గతంలో మహీంద్ర యూనివర్సిటీలో విద్యార్థులను ర్యాగింగ్ చేసి కొట్టినా, మద్యం తాగుతూ పార్టీ చేసుకునే భగీరథ్, 17 ఏళ్ల అమ్మాయికి నిజంగా భయపడుతడా ? అని ప్రవీణ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లో కేసు తర్వాత.. బాధితురాలి తల్లి ఫిర్యాదుపై కేసు

బాధితురాలి తల్లి శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు ఫార్చునర్ కారులో వచ్చారని, బాధితురాలి తండ్రికి బెంజ్ కారు ఉందని ప్రవీణ్ కుమార్ వివరించారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని, ముందు ఒక ఎస్సై మాట్లాడి, తర్వాత సీఐ మాట్లాడన్నారు. బండి సంజయ్ కొడుకు పై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ తో పాటు ఏసీపీ, సీఐ లు ఇప్పటి వరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఎందుకు రికార్డు చేయడం లేదు? మెజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. బాధితురాలి తల్లి వచ్చి ఫిర్యాదు చేస్తే సుమారు 8 గంటల తర్వాత 684/2026 కింద ఎఫ్ఐఆర్ చేశారని ప్రవీణ్‌ తెలిపారు. కానీ బీఎన్ఎస్ 74, 75, పోక్సో 11, 12 సెక్షన్ల ప్రకారం కేవలం 2, 3 ఏళ్ల శిక్ష పడే కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. 8 గంటలు పడిగాపులు కాస్తే… అధికారులు అందరూ కలిసి కాన్ఫరెన్స్ లో మాట్లాడుకొని కరీంనగర్ లో కేసు నమోదైన తర్వాత పేట్ బషీరాబాద్‌లో కేసు పెట్టారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

బండి కొడుకు గురించి మోదీ మాట్లాడాలి

ఆదివారం నాడు సాయంత్రం సికింద్రాబాద్ ఫరేడ్ గ్రౌండ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కనే బండి సంజయ్ కుర్చుంటాడన్నారు. రాష్ట్రంలోని లక్షలాది మహిళలకు బండి సంజయ్ కొడుకు గురించి చెప్పండన్నారు. ఆ అమ్మాయితో ఫోన్ లో చాలాసార్లు మాట్లాడాడు, చాటింగ్ చేశాడన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాం హౌజ్, హైదరాబాద్ ఉత్తర దిశలో అమ్మాయి ఇంట్లో బేస్ మెంట్ దగ్గర, నానక్ రాం గూడలో మూడు సార్లు అత్యాచార యత్నం చేశాడన్నారు. మొయినాబాద్ లో డిసెంబర్ 31వ తేదీన కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడన్నారు. తెలంగాణలో ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ? సైబరాబాద్ పోలీసులు ఏం చేస్తున్నారు ? అని ఆయన అడిగారు. ఎప్పుడూ మొయినాబాద్ ఫాం హౌస్ లపై నిఘా ఉంచే రాష్ట్ర పోలీసులు బండి సంజయ్ కొడుకును ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలన్నారు. అమ్మాయిని మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇపుడు చేసుకోనని చెప్పడంతో… ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందన్నారు. ఉరేసుకొని, చేయి కోసుకొని చనిపోవాలని ప్రయత్నించడం అత్యంత ఘోరం అన్నారు. వీ6 టీవీ ఛానల్ లో జర్నలిస్టుగా పనిచేసి కొద్ది సంవత్సరాల క్రితం బీజేపీ లో చేరిన ఒక వ్యక్తి ఈ కేసులో బ్రోకర్ పనిచేస్తున్నారన్నారు. కేసు పెట్టవద్దని బండి సంజయ్ తో మాట్లాడి… కేసు కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నాడన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉండగానే కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. నిర్మల్ లో సంజయ్ ప్రోద్భలంతోనే ఏప్రిల్ నెలలో అమ్మాయి, తల్లిదండ్రుల మీద ఎక్స్ ట్రాక్షన్ కేసులు నమోదు చేయించారన్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

బీజేపీ వాట్సాప్‌ యూనివర్సిటీ సృష్టి.. హనీట్రాప్‌

బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ లు, సోషల్ మీడియా కార్యకర్తలు హనీ ట్రాప్ అస్త్రం అంటూ … వసూళ్ల పర్వం.. కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ.. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని, అమ్మాయి మైనర్ కాదని… డబ్బు రాలేదని మీడియా సహాయంతో వివాదాస్పదం చేస్తున్నారని, అమ్మాయి తల్లిని చలాకీ అంటూ దారుణంగా మాట్లాడుతున్నారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హనీ ట్రాప్ అనేది గూఢాచారి, దేశ భద్రత, న్యూక్లియర్ రహస్యాలు చూసే పెద్ద వ్యక్తులను చేస్తారన్నారు. మహా న్యూస్ టీవీ ఛానల్ లో అమ్మాయి మీద తప్పుడు వార్తలు వేస్తున్నారని, గతంలోనే ఈ ఛానల్ పై దాడులు జరగ్గా… బండి సంజయ్ వెనుకేసుకొచ్చి సహకరించారు. ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం మహా టీవీ వెంటనే ఆపాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ హెచ్చరించారు.

బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి…

బండి సాయి భగీరథ్ సంబంధించిన కేసు పై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు తీవ్ర స్వరూపం కలిగినవిగా ఉన్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. అధికార బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగితే ప్రజలు సహించరని ఆమె హెచ్చరించారు.

Read Also |

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు? 5 కోట్ల డిమాండ్‌ చేశారంటూ సాయి భగీరథ్ ఎదురు కేసు..
Dwi Dwasha Yog | మే 11న ద్విద్వాశ యోగం.. ఈ ఐదు రాశుల వారికి డ‌బ్బే డ‌బ్బు..!
TVS iQube S 4.7kWh | 175 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త టీవీఎస్ ఐ క్యూబ్.. ధర ఎంతంటే..!

Latest News