రెడ్లలో రేవంత్ అంత బాహుబలి లేడు.. ఎప్పటికైనా సీఎం అవుతానన్న మల్లారెడ్డి

రేవంత్‌ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానని బీఆరెస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డలో రేవంత్‌ను బాహుబలిగా అభివర్ణించారు. ఎప్పటికైనా తాను సీఎం అవుతానన్నారు.

malla reddy intresting comments

విధాత, హైదరాబాద్:
రెడ్డి కులంలో రేవంత్ రెడ్డి అంత బలశాలి, బాహుబలి లేరని, గతంలో నిర్వహించిన రెడ్డి కుల సంఘం సమావేశంలోనే ఈ విషయాన్ని తను స్పష్టం చేశానని మాజీ మంత్రి, మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తను, రేవంత్ రెడ్డి ఇద్దరం అన్నదమ్ములమేనంటూ వ్యాఖ్యానించడం విశేషం. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డిని సీఎం చేసింది తానే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో అనుబంధం, సినిమాల్లో నటించాలనే తన కోరిక వరకు పలు విషయాలను పంచుకున్నారు. తనకు కూడా భవిష్యత్తులో ఏదో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక, ఆశ, ఆశయం ఉందంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

అయితే రేవంత్ రెడ్డిని సీఎంని చేసింది తానే అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రెడ్డి కులంలో రేవంత్‌రెడ్డి తప్ప మరో బలమైన నేత లేడని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన రెడ్డి సంఘం సమావేశంలో స్పష్టంగా చెప్పానని ఆయన అన్నారు. రెడ్డి కులంలో రేవంత్ ఒక్కరే బలమైన నేత అని తాను ఆనాడే నొక్కి చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఆయనదో పార్టీ, తనదో పార్టీ అయినా తను, రేవంత్ రెడ్డి ఇద్దరం అన్నదమ్ములమేనంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా దర్శకుడు హరీశ్ శంకర్ తనను తొలుత సంప్రదించారన్నారు. అయితే హరీశ్ శంకర్ ప్రతిపాదన ను అంగీకరించలేదన్నారు. నిజ జీవితంలో విలుకాకపోతే.. కనీసం సినిమాలో అయినా ముఖ్యమంత్రి కావాలని బలమైన కోరిక ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు.

Latest News