BRS | ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్‌ ఎందుకు సీరియస్‌గా తీసుకున్నది?

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్‌ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది? ఈ ఎమ్మెల్సీ స్థానంలో ప్రభుత్వం కూలిపోయేది లేదు నిలబడేదీ లేదంటూనే సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎందుకు శ్రమిస్తున్నది?

BRS | ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్‌ ఎందుకు సీరియస్‌గా తీసుకున్నది?

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్‌ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది? ఈ ఎమ్మెల్సీ స్థానంలో ప్రభుత్వం కూలిపోయేది లేదు నిలబడేదీ లేదంటూనే సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎందుకు శ్రమిస్తున్నది? అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్న మూడు ఉమ్మడి జిల్లాల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం మాత్రమే గెలుచుకున్నది. వరంగల్‌లో స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామలో తప్పా మిగిలిన పది స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారు. ఆయన కూతురు కడియం కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేసి పోటీ చేయడానికి నిరాకరించి కాంగ్రెస్‌లో చేరి ఆపార్టీ తరఫున ఎంపీ ఎన్నికల్లో నిలబడినారు.

తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లే ప్రధాన కారణమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తరచూ ప్రస్తావిస్తున్నారు. ఆ ఛానళ్లలో ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా నిలబడిన చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న కూడా ఒక కారణమని వారి ఆరోపణ. ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటం, మల్లన్న తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా బీఆర్ఎస్‌ను బాగా డ్యామేజీ చేశాడనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉన్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో మాత్రమే ఉన్నట్టు కనిపిస్తున్నది.

బీఆర్‌ఎస్‌ తరఫున రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం కేటీఆర్‌, హరీశ్‌, జగదీశ్‌రెడ్డిలు పనిచేస్తున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్‌రెడ్డి గెలుపు కోసం ఆపార్టీ నేతలు శ్రమిస్తున్నారు. ఈ ఉప పరిధిలోని పట్టణ ఓటర్లలో బీజేపీ కి అనుకూలంగా ఉంటారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ కనుక ఇక్కడ గెలుపు అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ఈ మూడు జిల్లాల్లో ఒక్క వరంగల్‌ మినహా మిగిలిన రెండు జిల్లాల్లో సంస్థాగతంగా బలంగా లేకపోవడం ఆపార్టీకి మైనస్‌ అంటున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తీన్మార్‌ మల్లన్నను మండలిలోకి తీసుకువచ్చి బీఆర్‌ఎస్‌ నేతలను మానసికంగా దెబ్బతీయాలని యోచిస్తున్నది.అందుకే బీఆర్‌ఎస్‌ ఎలాగైనా ఈ స్థానంలో గెలువాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఆపార్టీకి ఈ విషయంలో కొన్ని అనుకూల పరిస్థితులున్నాయి. మొన్నటి దాకా కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు బీఆర్‌ఎస్‌పై ముఖ్యంగా కేసీఆర్‌ పాలనపై, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన వాళ్లలోనూ మల్లన్నపై వ్యతిరేకత ఉన్నది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే ఉద్యోగార్థులు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సుక్క రాంనర్సన్న అయితే నమ్మొద్దు నమ్మొద్దు అనే పాట రాశాడు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీన్ని బీఆర్‌ఎస్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. యూట్యూబ్‌ ఛానల్‌లో మల్లన్న ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు ప్రశంసించిన వాళ్లే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం గమానార్హం.