KTR | సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో బీఆరెస్ విలీనమవుతుందన్న సీఎం రేవంరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు

బీజేపీతోనే రాజకీయ ప్రస్థానం ముగిస్తానని మోదీ అమిత్‌షాలకు చెప్పారని వ్యాఖ్యలు
దీనిపై నిజానిజాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్
మహిళా కమిషన్ నోటీస్‌లు అందాయి
24న హాజరవుతానని వెల్లడి
KTR | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ (BJP)లో బీఆరెస్ విలీనమవుతుందన్న సీఎం రేవంరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ మీడియా చిట్‌చాట్‌లో స్పందించారు. బీజేపీలో బీఆరెస్ విలీనం జరగని పని అని, త్వరలోనే రేవంత్ రెడ్డినే బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయమని వ్యాఖ్యానించారు. నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆరోపించారు. నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీ (ABVP)లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలని, ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి మోదీ (PM Modi) అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారని, రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందాయని, మెయిల్ ద్వారా నోటీసులు అందాయని కేటీఆర్ వెల్లడించారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ (Women’s Commission) ముందు హాజరవుతానని స్పష్టం చేశారు.
మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై జరిగిన దాడుల వివరాలు వారికి ఇస్తానని చెప్పారు. రుణమాఫీపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తుందని, సగం రుణమాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేశామంటూ రైతులను మోసం చేస్తుందన్నారు. బీఆరెస్ శ్రేణులు దీనిపై బ్యాంకులు, గ్రామాల వారికి వివరాలు సేకరించి ప్రజల ముందుంచుతామని, రుణమాఫీ కాని రైతులతో కలిసి రుణమాఫీ జరిగే దాకా కొట్లాడుతామన్నారు. 31వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి 17,934కోట్లు మాత్రమే మాఫీ చేసి, 46శాతం మాత్రమే మాఫీ చేసి మొత్తం రుణమాఫీ జరిగినట్లుగా రేవంత్‌రెడ్డి బుకాయిస్తున్నారన్నారు.