Damodara Rajanarsimha | స్పెషాలిటీ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సేవలు : మంత్రి దామోదర రాజనర్సింహ
స్పెషాలిటీ ఆసుపత్రు లలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈ హెచ్ ఎస్(EHS), ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది.

ఆరోగ్యశ్రీ, ఈహెచ్ ఎస్, ఆరోగ్య భద్రత కార్డు దారులకు అందిస్తామన్న అసోసియేషన్
త్వరలో బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి
ప్రతి నెల బిల్లులు క్రమం తప్నకుండా వచ్చేలా చేస్తామని హామీ
విధాత: స్పెషాలిటీ ఆసుపత్రు లలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈ హెచ్ ఎస్(EHS), ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ తో సమావేశమైన అసోసియేషన్ ఈ మేరకు నగదు రహిత వైద్య సేవలు అందించడానికి అంగీకరించింది.
నగదు రహిత వైద్య సేవలకు చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యం అవుతున్నందున జూలై 20వ తేదీ లోగా బకాయిలు చెల్లించని ఎడల రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న నగదు రహిత సేవలను రద్దు చేసుకుంటామని చేసిన హెచ్చరికపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తక్షణం స్పందించారు.
తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చెల్లించాల్సిన గత బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి త్వరలోనే అందజేస్తామన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా స్పెషాలిటీ హాస్పిటల్స్ అందిస్తున్న నగదు రహిత సేవలకు క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈనెల 20వ తేదీ (20.07.2024) నుండి నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అలాగే, నిరంతరం నగదు రహిత సేవలను కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు లేఖను మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ నరసింహ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న నగదు రహిత సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెరుగైన వైద్య సేవలను నిరంతరం అందించాల్సిందిగా తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ను కోరారు.