CM REVANTH REDDY | దేశాన్ని సంపదను దోచుకుంటున్న ప్రధాని, అదానీ..సెబీ అక్రమాలపై ఈడీకి సీఎం, డిప్యూటీ సీఎంల ఫిర్యాదు
దేశ సంపదను ప్రధాని మోదీ అదానీ, అంబానీలకు దోచుపెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీలో బీఆరెస్ విలీనం వ్యవహారం నిజం కాకపోతే ఆదానీ, సెబీ వ్యవహారంలో ఎందుకు జేపీసీని డిమాండ్ చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు

సెబీ అక్రమాలపై బీఆరెస్ ఎందుకు మాట్లాడటం లేదు
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా
సీఎం సహా మంత్రుల హాజరు
విధాత, హైదరాబాద్ : దేశ సంపదను ప్రధాని మోదీ అదానీ, అంబానీలకు దోచుపెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీలో బీఆరెస్ విలీనం వ్యవహారం నిజం కాకపోతే ఆదానీ, సెబీ వ్యవహారంలో ఎందుకు జేపీసీని డిమాండ్ చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదానీ, సెబీ వ్యవహారంలో బీఆరెస్ తన వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఈడీ కార్యాలయాల ముందు ఆందోళనల్లో భాగంగా గురువారం పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. తొలుత గన్ పార్కు వద్ద సమావేశమైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పోరేషన్ల చైర్మన్లు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని ఆందోళన చేపట్టారు. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో సెబీ నిబంధనలు ఉల్లంఘించిన సెబీ చీఫ్ మాధబీ పురీ బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్థలపైనా ఆరోపణలపై జేపీసీ విచారణకు ఆదేశించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఈడీ కార్యాలయంలోనికి వెల్లి సెబీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆరెస్‌లపై విమర్శలు గుప్పించారు.
ఇద్దరు ఒక్కటి కాకపోతే సెబీ అక్రమాలపై కేసీఆర్, కేటీఆర్ మాట్లాడాలి
దేశ వ్యాప్తంగా ఆదాని, సెబీ వ్యవహారంపై నిరసనలు సాగుతుంటే ప్రతి చిల్లర విషయానికి స్పందించే ట్విటర్ టిల్లు కేటీఆర్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు. సెబీ చైర్మన్ అక్రమాలను కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని, సెబీపై కేసీఆర్ తన విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆరెస్ ఒకటి కావడంతోనే బీఆరెస్ సెబీ అక్రమాలపై మాట్లాడటం లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షాలను మెప్పించేందుకే రాజీవ్ ఏయిర్ పోర్టు పేరు మారుస్తామని, రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని కేటీఆర్ చెబుతున్నారన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం జోలికొస్తే కేటీఆర్ వీపు చింతపండు కావడం ఖాయమని లేదంటే నా పేరు మార్చుకుంటానన్నారు. కేటీఆర్ వారి అయ్య కేసీఆర్ పోతే ఆయన విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నాడని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆరెస్ పాలకులు ఎందుకు పెట్టలేదన్నారు. మేం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో లోపల వచ్చే డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ప్రాంత పరిసరాల్లో రాజీవ్ విగ్రహం ఒక్కటే లేనందునే మేం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీజేపీ దేశానికి ముప్పుగా మారిందని, మోదీ అమిత్‌షా దేశాన్ని లూటీ చేస్తున్నారన్నారు. మేం మోదీ మీద కొట్లాడుతామన్న బీఆరెస్ సన్నాసులు సెబీ కుంభకోణంపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మీరు బీఆరెస్‌లో విలీనమవుతారో మలీనమవుతారో మాకు అనవసరమన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను బీఆరెస్‌నేతలు రెచ్చగొడుతున్నారని, వారి మాయలో రైతులు పడవద్దన్నారు. పదేళ్లు మిమ్మల్నిదోచుకున్నది ఈ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కదా, అందుకే ఆరు నెలల క్రితం మీరే కదా వారిని ఎన్నికల్లో బొంద పెట్టిందని,, మళ్లీ ఊర్లలోకి ఎందుకు రానిస్తున్నారన్నారు. వారిని హరీశ్‌రావు రాజీనామా చేయాల్సివస్తదన్న భయంతోనే రైతు రుణమాఫీపై ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే సిద్ధిపేటలో మైనంపల్లి హనుమంతరావు సవాల్ చేసిండన్నారు. పదేళ్లలో వారు రైతులకు ఇచ్చింది ఎంత..మేం పది నెలల్లో ఇచ్చిందెంతో అమరవీరుల స్థూపం వద్ద చర్చిద్ధామన్నారు. ఇప్పటికే 18వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖకు పంపించామని, 2లక్షల పైన ఉన్నవారి కోసం 12వేల కోట్ల పంపిణీ చేస్తామన్నారు. రైతులకు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని, మీ సమస్యలుంటే అధికారులను కలవండని, ఈ ప్రభుత్వం మీకోసం ప్రజాపాలనతో అందుబాటులో ఉందన్నారు. బీఆరెస్ సన్నాసులతో కలిసి రొడ్డెక్కితే రైతులకు ఆయసమే మిగులుతుందన్నారు. పదేళ్లలో ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ లాగా మేం పడుకోలేదని, రోజుకు 18గంటలు పనిచేస్తున్నామని, మీ సమస్యలు ప్రభుత్వం వింటున్నప్పుడు రైతులకు ధర్నాలు ఎందుకని రైతులను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎంత ఊదరగొట్టినా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240కన్నా ఎక్కువ రావని, బీఆరెస్‌కు సన్నా సీట్లేనని చెప్పానని వారికి అవే దక్కాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 39లో 9సీట్లు కూడా బీఆరెస్‌కు రావన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆరెస్ పాలకులకు అధికారంపోయి దోపిడికి అవకాశం లేక పదినెలల కాంగ్రెస్ పాలన మీద పడి ఏడుస్తున్నారన్నారు.
ఆ నలుగురి చేతిలో దేశ సంపద లూటీ
2014వరకు దేశం అప్పులు 55లక్షల కోట్ల అప్పులు చేస్తే ప్రధాని నరేంద మోదీ పాలనలో 183లక్షల కోట్ల అప్పులకు పెరిగిపోయాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. . దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా నెహ్రు, ఇందిరా సహా కాంగ్రెస్ ప్రధానులు చేసిన అభివృద్ధిని, సంస్థలను నాశనం చేస్తున్నారన్నారు. భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయికరణ, హరిత, నీలి విప్లవంటి వాటితో దేశాన్ని కాంగ్రెస్ ప్రధానులు అభివృద్ధి చేశారన్నారు. రాజీవ్‌గాంధీ హయంలోం ఐటీ విస్తరణతో దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చారన్నారు. స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ కల్పించడం ద్వారా దేశ చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లకు పునాది వేశారన్నారు. పీవీ, మనమోహన్‌లు ఆర్థిక సంస్కరణతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. గుజరాత్‌కు చెందిన మహాత్మగాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్‌లో దేశం కోసం పనిచేస్తే, అదే ప్రాంతానికి చెందిన మోదీ, అమిత్ షా, అదానీ, అంబనీలు దేశాన్ని దోచకుంటున్నారన్నారు. సెబీ చైర్ పర్సన్‌ను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, నాలుగు రోజుల ముందే పార్లమెంటను వాయిదా వేసుకుని పరారైందన్నారు. ప్రజల లక్షల కోట్ల సంపదను వారు ఏ విధంగా దోపిడి చేస్తున్నారో తెలిపేందుకు కాంగ్రెస్ ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టామన్నారు. జాతీ సంపదను మోదీ, అమిత్ షాలు అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారన్న సంగతి ప్రజలు గ్రహించాలన్నారు. దేశాన్ని బీజేపీ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు.