పాల‌మూరును స‌ర్వ‌నాశ‌నం చేసిందే కాంగ్రెస్: సీఎం కేసీఆర్

పాల‌మూరును స‌ర్వ‌నాశ‌నం చేసిందే కాంగ్రెస్: సీఎం కేసీఆర్

పాల‌మూరు జిల్లా ఒక‌ప్పుడు పాలుగారిన జిల్లా. అద్భుత‌మైన జిల్లాను స‌మైక్య రాష్ట్రంలో ఘోర‌మైన గ‌తి ప‌ట్టించారు. ఆనాడు ఉన్న సీఎంలు కూడా జిల్లాను ద‌త్త‌త తీసుకున్నామ‌ని చెప్పి పునాది రాళ్లు వేశారు త‌ప్ప‌.. క‌సికెడు నీళ్లు తెచ్చివ్వ‌లేదు. పంట‌ట‌లు ఎండిపోయి వ‌ల‌వ‌ల ఏడ్సి, బొంబాయి బ‌త‌క‌పోయి చాలా వ‌ల‌స‌లు పోయి, చాలా బాధ‌లు అనుభ‌వించిన జిల్లా పాల‌మూరు. అలాంటి పాల‌మూరు జిల్లాను ఏ పార్టీ ప‌ట్టించుకున్న‌ది..? మ‌న గోస ఎవ‌డైనా చూసిండా..? అన్న‌ది ఆలోచించాలి.


కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దులు ఒరుసుకుంటూ పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గ‌తి ప‌ట్టించింది ఏ పార్టీనో ఆలోచించాలి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా 50 ఏండ్ల పాటు చాలా క‌రువు అనుభ‌వించింది. దానికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌లిసి మ‌న ప్రాజెక్టుల‌ను స‌మైక్య పాల‌కులు ర‌ద్దు చేశారు. ఒక‌టే ఒక్క ప్రాజెక్టు అడ‌గ‌లేదు నాటి కాంగ్రెస్ నాయ‌కులు. బ‌చ‌వాత్ ట్రిబ్యున‌ల్ 1974లో న‌ది నీళ్ల పంప‌కం చేస్తే ఏ మంత్రి, ఎమ్మెల్యే అడ‌గ‌లేదు. పాల‌మూరుకు నీళ్లు ఎన్ని కేటాయిస్తున్నార‌ని ప్ర‌శ్నించ‌లేదు. ఇది రికార్డులో ఉంది.. రాజ‌కీయం కోసం చెప్ప‌ట్లేదు.


ఈ ప్రాంతం ఏపీలో క‌ల‌క‌వ‌పోతే చాలా బాగుప‌డుతుంటే.. న‌ష్ట‌పోయింది.. చారెడు నీళ్లు కావాల‌ని అడిగేతోడు లేడు. మాకు వికారం అనిపిస్తుంది అని చెప్పి బ‌చావ‌త్ ట్రిబ్యున‌లే.. 17 టీఎంసీల సామ‌ర్థ్యం గ‌ల‌ జూరాల ప్రాజెక్టు మంజూరు చేశారు. దాన్ని క‌ట్ట‌లేదు. మ‌న తెలంగాణ బిడ్డ అంజ‌య్య ముఖ్య‌మంత్రి అయ్యాకు శంకుస్థాప‌న చేస్తే ఆ ప్రాజెక్టు ముంద‌ర‌ప‌డ్డ‌ది. అయినా నీళ్లు రాలేదు. క‌ర్ణాట‌క‌కు చెల్లించాల్సిన డ‌బ్బు చెల్లించ‌కుండా దుర్మార్గం చేసి, 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా క‌ర్ణాట‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌లేదు.. ఇక్క‌డ రైతాంగానికి నీళ్లు ఇవ్వ‌లేదు. ఇది చ‌రిత్ర నేను చెప్పేది స‌త్యం.


ఇంత అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. పాల‌మూరును స‌ర్వ‌నాశ‌నం చేసిన పార్టీ కాంగ్రెస్సే. మీ పెద్ద‌ల‌ను అడిగినా ఇదే విష‌యం చెబుతారు. నేను చెప్పింది నిజ‌మైతే ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలి. నిజం కాక‌పోతే మ‌మ్మ‌ల్ని ఓడించండి. 2004లో పొత్తు పెట్టుకుని మ‌ళ్లీ మోసం చేసింది. వైఎస్ మాట‌లు విని మ‌న పార్టీని మోసం చేసింది కాంగ్రెస్. ఎమ్మెల్యేల‌ను కొనే ప్ర‌య‌త్నం చేశారు. కేసీఆర్ స‌చ్చుడో.. తెలంగాణ వ‌చ్చుడో అని మొండిప‌ట్టుద‌ల‌తో పోతే, 14 ఏండ్ల పోరాటం త‌ర్వాత చివ‌ర‌కు దీక్ష ప‌డితే దిగివ‌చ్చి తెలంగాణ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ళ్లీ వెన‌క్కి వెళ్లారు. వంద‌ల మంది పిల్ల‌ల ప్రాణాల‌ను బ‌లిగొన్న త‌ర్వాత‌, ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డితే త‌ప్ప‌నిస‌రిస్థితుల్లో గ‌తిలేక తెలంగాణ‌ను ఇచ్చింది కాంగ్రెస్.


పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగ‌మైన‌ కరివెన రిజర్వాయర్‌ పనులు పూర్తి కావొచ్చాయని.. అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ కండ్ల ముందే ఉన్నది. పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అందరూ కలిసి నెట్టంపాడు, బీమా, కల్వకుర్తి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చుకున్నాం. మీదగ్గర కూడా కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ మొదలుపెట్టినా పెండింగ్‌లో ఉండే. వెంకటేశ్వర్‌రెడ్డి పట్టుపట్టి పనులు పూర్తి చేయించి నీళ్లు వచ్చేలా ప్రయత్నం చేశారు. నిన్నగాక మీ కండ్ల ముందనే పాలమూరులో స్విచ్ఛాన్‌ ఆన్‌ చేశాను. పాలమూరు-రంగారెడ్డి పథకం అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. త్వరలోనే నీళ్లన్నీ రాబోతున్నాయి’.


మీ నియోజకవర్గంలోనే కరివెన రిజర్వాయర్‌. ఈ రిజర్వాయర్‌ ఎక్కడ పెట్టాలని నేను వెంకటేశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి కలిసి చెట్లు, గుట్లన్నీ స్వయంగా తిరిగాం. తక్కువ నష్టంతో ఎక్కువ నీళ్లు రావాలి.. గుట్టల వద్ద రిజర్వాయర్‌ ఉండాలని స్వయంగా పరిశీలన చేశాను. ఆ తర్వాత కరివెన రిజర్వాయర్‌ను కట్టుకున్నాం. రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. కొద్ది నెలల్లోనే నీళ్ల రాబోతున్నయ్‌. ఒకసారి కంప్లీట్‌ అయితే దేవరకద్ర నియోజకవర్గంలో 60వే-70వేలకు నీరందుతుంది.


వెంకటేశ్వర్‌రెడ్డి సాధించిన 99వేలు కాకుండా.. మరో 60వేలు దాటితే 1.50లక్షల ఎకరాలకు దేవరకద్ర నియోజకవర్గానికి నీళ్లు అందుతయ్‌. ఈ రకంగా పని జరిగింది. మీ కండ్ల ముందున్నది. విషయాలన్నీ మీకు తెలుసు. మనం కొత్త మేనిఫెస్టోను విడుదల చేశాం. పెన్షన్‌, రైతుబంధు ఎంత పెంచుతాం.. సన్నబియ్యం ఎలా ఇస్తామనేది మీ కండ్ల ముందున్నది. వెంకటేశ్వర్‌రెడ్డి గట్టి మనిషి. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత పనులు అడుగలేదు. ఎప్పుడు అడిగినా చెక్‌డ్యామ్‌లు, కాలువలు, డబుల్‌ బెడ్రూం, గృహలక్ష్మి ఇండ్ల గురించి అడిగారు తప్పా.. మరేం అడుగలేదు. ఆయన కోరిన కోర్కెలను గవర్నమెంట్‌ మళ్లీ వచ్చాక నెరవేర్చే బాధ్యత నాది’ .


‘చెక్ డ్యాం వెంక‌టేశ్వర్ రెడ్డి అని పేరు పెట్టాలి. ప‌ట్టుబ‌డ్డి 30 చెక్ డ్యాంలు మంజూరు చేయించి ల‌క్ష ఎక‌రాల్లో వ‌రి పంట పండించాడు. మంచి నాయ‌కుడు. ఐదు గంట‌లు వేచి ఉన్నారంట‌నే ఆయ‌న విజ‌యం ఖాయ‌మైంద‌ని మ‌న‌వి చేస్తున్నాను. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హెలీకాప్టర్‌ చెడిపోవ‌డం మూలానా లేట్ అయింది. ప్రజాస్వామ్యంలో మ‌న ఆశించిన ప‌రిణితి రావ‌డంలేదు. ఆదేశాలు గొప్పగా దూసుకుపోతున్నాయి. ఎల‌క్షన్లు వ‌స్తుంటాయి పోతాంటయ్‌. ఎన్నిక‌లు రాగానే పార్టీ త‌ర‌పుల‌న వ్యక్తులు నిల‌బ‌డుగారు.


త‌ప్పకుండా అభ్యర్థి మంచిచెడు చూడాలి. గుణ‌గ‌ణాలు ప‌రిశీలించాలి. అంత‌కంటే ముంఖ్యంగా పార్టీ న‌డ‌వ‌డిక‌, విధానం, ప్రజ‌ల గురించి ఆలోచ‌న స‌ర‌ళి ఏంది..? అధికారం అప్పజెప్తే ఏ పంపిర‌పాల‌న చేస్తరో అనే చ‌రిత్రను చూడాలి. ప్రజ‌ల ద‌గ్గర ఉండే ఒక వ‌జ్రాయుధం ఓటు. ఐదేండ్ల భ‌విష్యత్‌ను నిర్ణయిస్తుంది. ఆషామాషీగా అల‌వోక‌గా ఓటు వేయొద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవ‌రి ద్వారా మేలు జ‌రుగుత‌దో ఆలోచించాలి. అందుకోమే మీ విచ‌క్ష‌ణ ఉప‌యోగించండి.. గ్రామాల్లో చ‌ర్చ పెట్టండి ఏది నిజ‌మో ఆలోచించి ఓటు వేయండి.