కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోకూడదు: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోకూడదు: సీఎం కేసీఆర్

– బంగారు క‌త్తి అని మెడ కోసుకోవద్దు

– ధరణితో అన్న‌దాత‌ల‌కే భూమిపై హక్కు

– కౌలు రైతుల‌ను ప‌త్రాల్లో చేర్చేదే లేదు

– కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో వేయండి

– కరువు సీమలో నేడు ధాన్యపురాశులు

– పల్లా రాజేశ్వర్ రెడ్డి నా ఇంట్లో మనిషి

– జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్

– బీఆరెస్‌ తీర్థం పుచ్చుకున్న పొన్నాల

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బంగారు క‌త్తి అని మెడ కోసుకోకూడద‌ని, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు నమ్మి మోసపోకూడద‌ని బీఆరెస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామ‌ని చెబుతున్నార‌న్న కేసీఆర్‌.. రైతులకు తమ భూమి మీద హక్కు ఇచ్చేందుకు తల బద్దలు కొట్టుకొని, వారు మునిగిపోకుండా ధరణి పోర్టల్ తెచ్చామ‌ని, అలాంటి ధరణిని కాదంటున్నందుకు బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని వేయాలా? ధరణిని వేయాలా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. కాంగ్రెస్ వాళ్లు కౌలు రైతులను మళ్లీ తీసుకొచ్చారని విమర్శించారు. బంజారాహిల్స్‌లో ఇల్లు ఉంటే కబ్జా ఖాతాలో వారి పేరు రాస్తున్నామా? అంటూ ప్రశ్నించారు. త‌న‌ ప్రాణం పోయినా సరే ఇది మాత్రం జరగదని, కాంగ్రెస్ చెప్పే కౌలు రైతులు అనేది అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. నేను కాపోన్నే కాబట్టి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.

ఎన్నికల్లో కాంగ్రెసును శిక్షించాలి

కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు చాల‌ని చెబుతున్న‌ద‌ని, వాళ్లు ప‌రిపాలిస్తున్న‌ కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ చెప్పారు. అలాంటి కాంగ్రెస్‌ను శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని కేసీఆర్‌ కోరారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఆగం కావద్దని, ఏమరపాటుతో ఉండాలని సూచించారు. ఈ ప్రభుత్వాన్ని పొడగొట్టుకోవద్దని చెప్పారు. కులాలు, మ‌తాలు, వ‌ర్గాల‌కు అతీతంగా అందరి అభివృద్ధి కోసం తాము పాటు ప‌డుతున్నామ‌ని అన్నారు.

93 లక్షల మందికి జీవిత బీమా

రాష్ట్రంలో ఉన్న 93 లక్షల మందికి ఐదు లక్షల జీవిత బీమా అమలు చేయాలని నిర్ణయించామని కేసీఆర్ చెప్పారు. మ‌ళ్లీ అధికారంలోకి రాగానే మూడు, నాలుగు నెలలలో అమలు చేస్తామన్నారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం మ‌న‌దేన‌న్న కేసీఆర్.. అలాంటి తెలంగాణ‌లో పేద ప్ర‌జ‌లు కూడా సన్నబియ్యంతో అన్నం తినాలనే లక్ష్యంతో రేష‌న్ కార్డుల ద్వారా సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రైతులు, కూలీలు అన్ని వర్గాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు.

కరువు సీమలో ధాన్యం పంట

జనగామ కరువును చూసి ఒకప్పుడు కండ్ల నీళ్లు తిరిగాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వడ్లు ఎక్కువ పండే తాలూకాగా జ‌న‌గామ మారిపోయిందని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు కట్టినప్పటికీ నది నీళ్లు అందకపోవడంతో ఇప్పుడు సమ్మక్క బ‌రాజ్‌ కట్టామని, దానిద్వారా వచ్చే ఏడున్నర టీఎంసీల నీటిని వరంగల్ జిల్లాకు ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. మల్లన్న సాగర్‌ను త‌పాస్‌ప‌ల్లికి లింకు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుందని వివరించారు.

నీళ్లతో పాటు 24 గంట‌ల‌ కరెంటు వల్ల పంటలు పుష్కలంగా పండుతున్నాయ‌ని సీఎం చెప్పారు. మోట‌ర్లు కాలడం, ట్రాన్స్‌ఫార్మ‌ర్లు కాలడం ఇప్పుడు లేదని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీ దేవత తాండవిస్తున్న‌ద‌ని, లక్షల టన్నుల ధాన్యం పండుతున్న‌ద‌ని అన్నారు. మచ్చుపహడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పరిశీలిస్తామన్నారు. అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి, జనగామ గ్రోత్‌కారిడార్లుగా ఎదిగాయని వివ‌రించారు. జనగామ ప్రగతి ప్రణాళికను అమలు చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం అనుసరించిన మతసామరస్య విధానాల ఫలితంగా రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి, బీసీల‌ అభివృద్ధికి, గృహలక్ష్మి పథకంతో పాటు ఆసరా పెన్షన్లు, దళిత బంధు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి నా ఇంట్లో మనిషి

ముత్తిరెడ్డి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయని, అందుకే ఆయన స్థానంలో ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం ఇచ్చామని కేసీఆర్‌ చెప్పారు. ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఎప్ప‌డూ త‌న ఇంట్లోనే ఉంటార‌ని చెప్పిన కేసీఆర్‌.. పాల‌సీ నిర్ణ‌యాల్లో త‌న‌తో భాగ‌స్వామి అవుతార‌ని చెప్పారు. నీరడిగాడే నీ దగ్గర ఉన్నాడ‌ని, కేసీఆర్ ప‌క్క‌నే ఉండే వ్య‌క్తి అని చెబుతూ.. ఆయ‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు.

– బీఆరెస్‌ తీర్థం పుచ్చుకున్న పొన్నాల

సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సోమవారం జనగామ బహిరంగ సభ వేదికగా బీఆరెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సభలో పొన్నాల మాట్లాడుతూ జనగామ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు బీఆరెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జనగామలో పాడి పరిశ్రమకు చేయూతనివ్వాలని, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. జనగామ అభ్యర్థి ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జనగామను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. తనను ఆశీర్వదించాలని కోరారు. జనగామకు పెద్ద పాలేరుగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ సభకు మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షత వహించగా బీఆరెస్‌ నేతలు సత్యవతి రాథోడ్, బండా ప్రకాష్, కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు.