C.M. REVANT REDDY | డ్రగ్స్‌పై యుద్ధంలో ఎన్‌ఎస్‌ఎస్ భాగస్వామి కావాలి … జేఎన్టీయూ ఎన్‌ఎస్‌ఎస్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం యుద్ధమే ప్రకటించిందని, ఇందులో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు సైతం భాగస్వామ్యం కావాలని మీ అన్నగా నేను పిలుపునిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు

C.M. REVANT REDDY | డ్రగ్స్‌పై యుద్ధంలో ఎన్‌ఎస్‌ఎస్ భాగస్వామి కావాలి … జేఎన్టీయూ ఎన్‌ఎస్‌ఎస్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : డ్రగ్స్‌పై తెలంగాణ ప్రభుత్వం యుద్ధమే ప్రకటించిందని, ఇందులో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు సైతం భాగస్వామ్యం కావాలని మీ అన్నగా నేను పిలుపునిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ధేందుకు సహకరించాలని కోరారు. అన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా చెప్పారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రి డి.శ్రీధర్‌బాబు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ స్కూళ్లు, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అవసరం ఎంతో ఉందని, పోలీసులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకుంటే.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చవచ్చన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిందని తెలిపారు. సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చన్నారు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చని, కుటుంబ వ్యవస్థ విచిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలను కారణమన్నారు. చిన్నారుల మానసిక దృఢత్వానికి ఉమ్మడి కుటుంబం తోడ్పడుతుందని, పిల్లలలో సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉందని, అందుకు వారిని మానసికంగా సంసిద్ధం చేయాలన్నారు. కేవలం విద్యాసంస్థల్లో విద్యాబోధనే కాకుండా మోరల్ పోలీసింగ్ కూడా నేర్పించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలన్నారు. మోరల్ పోలీసింగ్‌తో అన్ని రకాల సమస్యలను పరిష్కరించవచ్చని పేర్కోన్నారు.

క్రీడలను ప్రొత్సహిస్తాం

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. భవిష్యత్ లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యతని, ప్రజా సమస్యలపై ఫోకస్ గా పనిచేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరానన్నారు. సమస్యలకు భయపడి పారిపోవద్దని, నిలబడి సమస్యలపై పోరాడాలని సూచించారు. జీవితంలో ఫోకస్ గా పనిచేయడం ద్వారా లక్ష్యాలను సాధిస్తారన్నారు. నరేంద్రమోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలేనని, రోజుకు 16గంటలు మీరు ఎంత ఫోకస్ గా పని చేస్తారో… అది మీ లక్ష్యాన్ని అంత చేరువ చేస్తుందన్నారు. మన జీవితం మన చేతుల్లోనే ఉందని, మన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. గొప్ప వ్యక్తులు ఎవరూ గొప్ప కుటుంబాల నుంచి రాలేదని, ఎవరూ ఎవరికంటే తక్కువ కాదని స్పష్టం చేశారు.