CM Revanth Reddy | చేతనైతే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేసి చూడు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆరెస్ మాదిరిగా సచివాలయం వెలుపల కాకుండా లోపటనే గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామని, అది కూడా రానున్న డిసెంబర్ 9ననే ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

డిసెంబర్ 9న మేమే తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తాం
రాజీవ్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Thali Statue) బీఆరెస్ మాదిరిగా సచివాలయం వెలుపల కాకుండా లోపటనే గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామని, అది కూడా రానున్న డిసెంబర్ 9ననే ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం సోమాజిగూడలో ఉన్న రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను నేతలు గుర్తుకుతెచ్చుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఐటి అభివృద్ధి (IT Development)కి, పంచాయతీరాజ్ సంస్కరణలకు ఆధ్యుడు రాజీవ్‌గాంధీ అని అన్నారు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్నిసచివాలయం ముందు పండుగ వాతావరణంలో ఆవిష్కరించుకుందామన్నారు. మేం ఏర్పాటు చేసే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారని, వారికి అధికారం పోయినా బలుపు తగ్గలేదన్నారు. వారి బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారు. ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండని, రాజీవ్ విగ్రహాన్నిటచ్ చేస్తే చెప్పు తెగే దాకా కొడుతామని, వీపు చింతపండు అవుతుదని కేటీఆర్‌ను హెచ్చరించారు.
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేశాక ఏ రోజు తొలగిస్తారో చెబితే మా జగ్గన్న వస్తడని, అప్పుడు తెలుస్తది నీకు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందోనని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకుంటే మీరు పదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు పెట్టలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వాళ్ల అయ్య కేసీఆర్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుందామనుకున్నాడని, వాళ్ల అయ్య పోయేదెప్పుడు? విగ్రహాన్ని పెట్టేదెప్పుడని ఎద్దేవా చేశారు. ఉద్యమం ముసుగులో అధికారంలోకి వచ్చి పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారన్నారు. నీ అయ్య తెలంగాణను దోచుకున్న దొంగ అని, తాగుబోతు సన్నాసులకు, దొంగలకు సచివాలయం ముందు స్థానం లేదన్నారు.
తాగుబోతు సన్నాసి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడుతారా?. తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా?. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడని.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చింతమడకకే పరిమితమని కేటీఆర్ (KTR)ను ఉద్ధేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పట్ల మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదని, మీలాగా మేం తాగుబోతు సన్నాసులం కాదని, పొద్దునొకటి, రాత్రి ఒకటి చెప్పమని, ఈ రోజు చెప్పినట్లుగా రానున్న డిసెంబర్ 9న సచివాలయం లోపట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. బీఆరెస్ నాయకులు ఇష్టమున్నట్టు మాట్లాడితే సామాజిక బహిష్కరణ చేస్తామన్నారు.
రాజీవ్ బాటలో ఆధునిక భారతం
దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని, విప్లవాత్మకమైన చైతన్యానికి కారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండియా ప్రపంచంతో పోటీ పడేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technology) ప్రొత్సహించిన ప్రధానిగా రాజీవ్‌గాంధీ చరిత్రలో నిలిచారన్నారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అని, మహిళా సాధికారతకు, పంచాయతీరాజ్ సంస్కరణలకు రాజీవ్ ఆధ్యుడన్నారు. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారన్నారు. ఒలింపిక్స్‌లో చిన్న దేశం సౌత్ కొరియా కంటే ఇండియా ప్రదర్శన పేలవంగా ఉందని, 1921 నుంచి 1931 వరకు గాంధీ నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా అని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలోనే నెలకొల్పుతామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.