సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు సీఎం గ్రీన్ సిగ్నల్

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సవరించిన అంచనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థనకు నేడు క్యాబినేట్  ఆమోదం తెలిపింది

  • By: Subbu |    telangana |    Published on : Jul 29, 2025 1:10 PM IST
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు సీఎం గ్రీన్ సిగ్నల్
– రూ 13,058 కోట్ల  నుంచిరూ 19,325 కోట్లకు సవరించిన అంచనాలకు ఆమోదం 
– సీఎం రేవంత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల 
– ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ మరియు మంత్రివర్గానికి ధన్యవాదాలు
– గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం 
– సవరించిన అంచనాలతో మూడు జిల్లాలు 11 నియోజకవర్గాలకు లబ్ధి 
– సాగులోకి 3,29,000 ఎకరాల కొత్త ఆయకట్టు
– 3,45,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు
– బీడు భూములన్ని సస్యశ్యామలం 
– ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం 
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 
విధాత: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సవరించిన అంచనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థనకు నేడు క్యాబినేట్  ఆమోదం తెలిపింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.13,057 కోట్ల  నుంచి  రూ.19,325 కోట్ల వరకు అనుమతి అనుమతిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరో మూడు జిల్లాలలో గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. ప్రధాన పంట కాలువలు అన్ని ఆధునీకరణ, మరమ్మత్తులు చేపట్టనున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయనిగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము నిలుస్తుందని, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మంత్రి తుమ్మల అడిగిందే తడువుగా సీఎం రేవంత్ రెడ్డి సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి శరవేగంగా పనులు ప్రారంభించాలని సూచించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కానుంది.
సీఎంకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,  రాష్ట్ర మంత్రివర్గానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల శ్రేయస్సుకు రైతాంగ అభ్యున్నతికి, ప్రగతి కోసం కాంగ్రెస్ సర్కారు ప్రతినిత్యం పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను అడిగిన ప్రతి అంశాన్ని వెంటనే పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. రైతన్నల శ్రేయసుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సవరించిన అంచనాలతో లక్షలాది ఎకరాల బీడు భూముల రూపు రేఖలు మారనున్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతాయని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ చరిత్రలో అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. పచ్చని పొలాలతో పరిడవిల్లే తెలంగాణకు సీతారామ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.
సీతారామ సవరించిన అంచనాలతో ప్రయోజనం
ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 11 నియోజకవర్గాలు 31 మండలాల్లో 3,29,000 ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 3,45,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు సాగుబడిలోనికి వస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 104 కిలోమీటరు వరకు పూర్తి చేశారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంట కాలువలు ఆధునికరణ మరమ్మత్తులు చేపట్టనున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు, ఉమ్మడి జిల్లా కు త్రాగునీరు అందనుంది. పచ్చని పంట పొలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పైర్లతో కళకళలాడనుంది. సత్తుపల్లి ట్రంకు (టన్నెల్) & పాలేరు లింకు కాలువలో 60 కిలోమీటర్ల వరకు పూర్తి అయింది. మిగిలిన 125  కిలోమీటర్ల  కాలువ పనులు పురోగతిలో ఉంది. ఇది ఏడాది కాలంలో పూర్తికానుంది.
•8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ లు అన్నింటికీ టెండర్స్ పిలిచారు. దీనికి సంబంధించిన భూసేకరణ నిమిత్తము LP షెడ్యూల్స్ సంబందిత జిల్లా కలెక్టర్  ( ఖమ్మం , కొత్తగూడెం)  పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రామ సభలు మరియు ఎంజాయ్మెంట్ సర్వే పురోగతి దశలో ఉంది.
డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ  భూసేకరణ  పనులు, ఆరు నెలలలోగా  నోటిఫికేషన్ స్టేజ్ లోకి వస్తాయి. వెంటనే కాలువల పనులు మొదలు పెట్టి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. రెండు సంవత్సరముల కాలములో ఈ కాలువలు పూర్తి  చేసేలా చర్యలు తీసుకొనున్నారు.
•ఈ సంవత్సరం జూన్ ఆఖరుకు రాబోయే ఖరీఫ్ సీజన్ లో 1,600 క్యూసెక్కులు నీరు విడుదల చేయడం జరుగుతుంది.  దీని ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టు 1,21,000 ఎకరాలకు ఆయకట్టుకు , మరో 10,000 ఎకరాలు  చిన్న నీటిపారుదల చెరువుల కు నీరు అందనుంది.
•ఈ ప్రాజెక్టుకు సవరించిన అంచనా మంజురు చేయడం వలన ప్యాకేజీ 9 లో యాతలకుంట టన్నెల్ పూర్తి చేసి సుమారు 120 చెరువులకు డిసెంబర్ నెలలోగా నీరు ఇవ్వటం నిమిత్తము ప్రణాళికలు చేసి పనులు జరుగుచున్నవి.
•ఈ ప్రాజెక్టుకు సవరించిన అంచనా మంజురు చేయడం వలన జూలూరుపాడు టన్నెల్ మొదలుపెట్టి త్వరగతిగా పూర్తి చేసి 2026 చివరి నాటికి పాలేరుకు నీటి సరఫరా చేయటం కొరకు ప్రణాళిక చేయడం జరిగింది.
• సీతారామ ప్రాజెక్టు మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు డిపిఆర్ (DPR) కు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) వారి నుండి సాంకేతిక సలహా కమిటీ అన్ని డిజైన్లకు అనుమతించింది.
• తద్వారా పూర్తి స్థాయిలో సాగునీటిని రైతాంగానికి అందించడం, పరిశ్రమలకు మరియు మిషన్ భగిరథ పథకము ద్వారా త్రాగు నీటిని అందించడం జరుగుతుంది.