తొలిముద్దతో చిన్నారులకు పోషకాహారం : సీఎంరేవంత్ రెడ్డి

అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ‘తొలిముద్ద’ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల ఆరోగ్యాభివృద్ధికి ఇది కీలకమన్నారు.

Tholimudda breakfast program for anganwadi children

విధాత, హైదరాబాద్ : అంగన్వాడీ చిన్నారులకు తొలి ముద్ద పథకంలో పోషకాహారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో అంగన్వాడీలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తొలిముద్ద పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లను పంపిణీ సైతం ప్రారంభించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీ ఉంది.. కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదు అన్నారు. అందుకే ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టిక ఆహారం అందిస్తోందని తెలిపారు. ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ స్కీం ను కూడా ప్రారంభించాం అన్నారు.

తొలిముద్ద బ్రేక్ ఫాస్ట్ పథకంలో చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్ అందించనున్నట్లుగా తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల ఉంటుంది అని, పోష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రేవంత్ పేర్కొన్నారు. భవిష్యత్ లో అవే అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.

ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు చేసినా అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం మీపై గురుతర బాధ్యత పెట్టింది అని, అంగన్వాడీ చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోంది అని, మీ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అన్నారు. ఏ మాత్రం ఆర్ధిక వెసులుబాటు కలిగినా ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీళ్లేదు… సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

నా కడుపులో విరాట్ కోహ్లీ బిడ్డను మోస్తున్నా..యువతి హల్చల్
Pilot Rohith Reddy : వాట్ నెక్ట్స్ …. షోకాజ్ నోటీసులపై రోహిత్ రెడ్డి నో ఆన్సర్ !

Latest News