Site icon vidhaatha

CM Revanth Reddy | రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

రైతు రుణమాఫీ..పాలన, రాజకీయ అంశాల నివేదన
వరంగల్ సభకు రావాలంటూ ఆహ్వానం
సోనియాగాంధీ, ఖర్గేలతోనూ భేటీ

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షిలు సోమవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను వేర్వేరుగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల అమలు పురోగతి, తాజాగా చేపట్టిన 32వేల కోట్ల రైతు రుణమాఫీ పథకం సహా పరిపాలన, రాజకీయ అంశాలను ఈ సందర్భంగా రాహుల్‌గాంధీకి వివరించారు. శాసన సభ బడ్జెట్ సమావేశాల నిర్వాహణ, తీసుకోబోతున్న నిర్ణయాలను రాహుల్‌కు తెలిపారు. అలాగే రైతు రుణమాఫీ నేపథ్యంలో ఈనెలఖారున వరంగల్‌లో తలపెట్టిన కాంగ్రెస్ కృతజ్ఞత బహిరంగ సభ అంశాన్ని రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.

వరంగల్ సభకు హాజరుకావాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌న్‌ను ప్రకటంచామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేపట్టినందునా రాహుల్‌, సోనియాగాంధీలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించ తలపెట్టినట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి బృందం వివరించింది. అలాగే తెలంగాణ పీసీసీ నూతన సారధి ఎంపిక, కేబినెట్ విస్తరణ అంశాలపై సైతం రాహుల్‌గాంధీతో చర్చించినట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతానికి ఆ రెండు అంశాల్లోనూ కాంగ్రెస్ అధిష్టానం వాయిదా పరిస్థితినే కొనసాగిస్తుందని సమాచారం. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బృందం సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలతో భేటీ అయ్యారు. ఆయా అంశాలపై వారితోనూ చర్చించారు.

Exit mobile version