CM Revanth Reddy | మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? : ఉద్యోగ సంఘాలపై సీఎం ఫైర్‌

సమస్య పరిష్కారం కోసం సమరానికి సై అన్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఫస్ట్‌ తారీఖునే జీతాలు ఇచ్చినందుకా? మీ సమరం? అని నిలదీశారు. ఇంతటి ఆర్థిక ఇబ్బందికర పరిస్థితికి కారణమైన వ్యక్తి హాయిగా ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని సెటైర్‌ వేశారు. మళ్లీ కోతుల గుంపునకు రాష్ట్రాన్ని అప్పగించొద్దని కోరారు.

CM Revanth Reddy | మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? : ఉద్యోగ సంఘాలపై సీఎం ఫైర్‌
  • ఫస్టు తారీఖే జీతాలు ఇస్తున్నందుకా మీ సమరం?
  • మనం పాలకులం కాదు.. సేవకులం
  • ప్రజలపై యుద్ధం చేసి ఎవరూ బాగుపడలేదు
  • ఇప్పుడు కావాల్సింది సమయస్ఫూర్తి
  • ఉద్యోగ నేతల్లారా.. తెలంగాణను మళ్లీ
    కోతుల గుంపునకు అప్పగించొద్దు..
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే పార్టీల
  • కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులు కావొద్దు
  • కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే
    ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది
  • బాధ్యత మరిస్తే తెలంగాణ సహించదు
  • ప్రభుత్వంతో నాయకులు చర్చలకు రావాలి
  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు
  • ఉద్యోగుల హెచ్చరికలకు ఘాటు కౌంటర్‌
  • ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి..
    ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని సెటైర్‌

CM Revanth Reddy | సమస్యల పరిష్కారం కోసం సర్కారుపై సమరం చేస్తామన్న ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటించడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌నుద్దేశించి అన్నారు. సోమ‌వారం పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన జీ అవార్డ్స్-2025 కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ ‘ఎవరిపై సమరం? మీ సమరం తెలంగాణ ప్రజలపైనా?’ అని ప్ర‌శ్నించారు. ‘ఎందుకు మీ సమరం? గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా?’ అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని ప్రకటించడమేంటని నిలదీశారు. ‘ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందాం.. రండి’ అని బ‌హిరంగంగా పిలుపు ఇచ్చారు. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడినవారు ఎవరూ లేరన్నారు. ‘ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. ఇప్పుడు కావాల్సింది సమరం కాదు.. సమయస్ఫూర్తి, సంయమనం’ అన్నారు. ‘మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించొద్దు.. నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదాం’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

గ‌త పాల‌కుల కార‌ణంగానే….
గ‌త‌ పాల‌కుల కార‌ణంగా ప్రతీ నెలా ఏడు వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్ప‌డింద‌ని రేవంత్ చెప్పారు. గత పాలకులు రూ.8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు తమపై ఆరోపణలు చేస్తున్నాయని, అవన్నీవాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలేన‌ని బీఆరెస్‌నుద్దేశించి అన్నారు. ‘ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయి పెట్టారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి .. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం అని హిత‌వు ప‌లికారు.

16 నెలల్లో 30వేల కోట్ల నగదు బదిలీ
పదహారు నెలల్లోనే తాము 30 వేల కోట్ల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేశామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దన్నారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని చెప్పారు.

ఎక్క‌డా అప్పులు పుట్ట‌డం లేదు
అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడంలేదని సీఎం రేవంత్ అన్నారు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారమ‌న్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. నన్ను కోసినా… వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేనని చెప్పారు. ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి… ఇపుడు ఫామ్ హౌస్ లో హాయిగా పడుకున్నారన్నారు.

నేరం జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త పోలీసుల‌ది
తెలంగాణలో పోలీసులు నూటికి నూరుశాతం శాంతిభద్రతలు కాపాడుతున్నారన్న రేవంత్ రెడ్డి నేరం జరిగినప్పుడే కాదు.. నేరం జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందన్నారు. దేశ సరిహద్దుల్లోని సైనికుల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా అందిస్తున్నామ‌న్నారు. విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్ ల కుటుంబాలకు రూ.2 కోట్లు, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ ల కుటుంబాలకు రూ. కోటిన్నర అందిస్తున్నామ‌ని చెప్పారు. పోలీస్ పిల్లల భవిష్యత్ కోసం 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించుకున్నామ‌న్నారు. వారికి మంచి భవిష్యత్ ను అందించే బాధ్యత మాదన్నారు. డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నామ‌ని చెప్పార‌న్నారు. మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేశామ‌ని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

Equity Markets: వేల్యూ ఇన్వెస్టింగ్.. మార్కెట్ అలజడిలో స్థిరమైన లాభాల ఎంపిక
Universe End  | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
Waqf (Amendment) Act, 2025 | వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హిందూ సంస్థ న్యాయపోరాటం!
TGE JAC | 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ.. సర్కార్‌పై తెలంగాణ ప్రభుత్వోద్యోగుల సమర శంఖం