KTR | మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై దూమారం రేపుతున్న కేటీఆర్‌ వ్యాఖ్యలు

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు డిమాండ్ చేశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

KTR | మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై దూమారం రేపుతున్న కేటీఆర్‌ వ్యాఖ్యలు

రికార్డింగ్‌..బ్రేక్‌ డాన్స్‌లు చేసుకోండంటూ వ్యాఖ్యలు
మండిపడిన మంత్రులు పొన్నం..సీతక్కలు
మహిళా కమిషన్లు కేసు నమోదు చేయలని వినతి

విధాత : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు డిమాండ్ చేశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడని మంత్రి పొన్నం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బస్సుల్లో మహిళా ప్రయాణికులు రికార్డింగ్‌..బ్రేక్‌ డాన్స్‌లు చేసుకోండంటూ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కేంద్ర, రాష్ట్ర మహిళా కమీషన్లు వెంటనే స్పందించి, కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ప్రారంభించిన తొలి నుంచి కేటీఆర్ తీరు ఇలానే ఉందని, మహిళలపై ఇలాంటి దూషణలను ఇప్పటికైనా మానుకోవాలన్నారు. పొన్నం. కాగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కేటీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

మంత్రి సీతక్క సైతం కేటీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ‘మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం’ అని మండిపడ్డారు. ‘మీ తండ్రి మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్? గుమ్మడికాయ దొంగలు ఎవరు? అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆలోచన మీకు రాలేదు.. మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్‌లు, రికార్డింగ్ డాన్స్‌లు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి అని, ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే… వారిని బ్రేక్ డాన్సులు వేసుకోమనడం దుర్మార్గమన్నారు. మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయని, మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండించారు. కేటీఆర్ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకొండి అనే ధైర్యం ఎలా వచ్చిందని నిలదీశారు. తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.అంతకుముందు కేటీఆర్‌ ఓ సమావేశంలో సీతక్క వ్యాఖ్యలను ప్రస్తావిస్తు మహిళలను బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తాము వద్దనట్లేదని, ఇంకా అవసరమైతే అదే బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు కూడా చేసుకోండని అన్నారు. దీనికొరకు అవసరమైతే ఒక్కో మహిళకు ఒక్కో బస్సుని కూడా పెట్టుకోండని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.