ఘంటా.. కాంగ్రెస్ ట్విటర్ వార్‌…సీఎంల భేటీపై రచ్చ

తెలంగాణ ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల భేటీపై టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి చేసిన పోస్టు కాంగ్రెస్ కౌంటర్‌, ఘాంటా రీప్లైతో ట్విటర్ వేదిగా రచ్చ సాగింది.

ఘంటా.. కాంగ్రెస్ ట్విటర్ వార్‌…సీఎంల భేటీపై రచ్చ

పరస్పర కౌంటర్లు

విధాత: తెలంగాణ ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల భేటీపై టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి చేసిన పోస్టు కాంగ్రెస్ కౌంటర్‌, ఘాంటా రీప్లైతో ట్విటర్ వేదిగా రచ్చ సాగింది. తెలంగాణ ప్రజాభవన్ కు రాబోతున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తన ట్వీట్‌లో స్వాగతం తెలిపిన ఘంటా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు తెలంగాణా ఆకాంక్షలు తెలుసని అనుకుంటుంటున్నానని తెలంగాణా విభజన సమయంలో మీరు నన్ను ఆహ్వానించినప్పుడు నేను అన్ని విషయాలు మీకు వివరించానని గుర్తు చేశారు.. మీరు కూడా పెద్దమనసుతో విన్నారని, అంగీకరించారని, రాష్ట్ర విభజనకు ఆమోదించారని పేర్కోన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలం అన్నదమ్ముల్లా విడిపోయాం. ఆత్మీయుల్లా కలిసే ఉంటున్నాం.

ఇప్పుడు కూడా ఇవాళ్టి సమావేశంలో తెలంగాణాకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సహకరించాలని, మా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు కాకుండా పాండవుల మాదిరి మావాళ్లు ఐదు గ్రామాలనే అడుగుతున్నారు. ఇచ్చేయండి. అలాగే సీఎం రేవంత్‌రెడ్డికి సహకరించి విభజన చట్టానికి అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిచండని కోరారు. 9, 10 షెడ్యూలులో ఉన్న అన్ని సంస్థలను, అందులోని ఉద్యోగులను, వనరులను చట్టం ప్రకారం తీసుకు వెళ్లండి. మీరు, మీ వాళ్లు హైదరాబాద్ లో ఉంటారు. ఉండండి. మేం అప్పుడప్పుడు ఆంధ్రాకు చుట్టపు చూపుగానో, పర్యాటకులుగానో వస్తాం.

రెండు రాష్ట్రాలు ఒకటే అని భావిస్తూనే రాష్ట్రాల కు చట్టపరంగా రావాల్సిన వాటాల విషయంలో రాజీ పడకుండా పంచుకుందాం. తేడా వస్తే తెలంగాణా సమాజం తెగిస్తుంది. ఈ సారి మళ్ళీ తెగేదాకా కొట్లాడుతుంది. ఇప్పుడు ఆ అవసరం రాకూడదు. కేసీఆర్ అధికారంలో ఉంటే ఆ అవకాశం, గౌరవం ఉండేదో, లేదో కూడా తెలియదు. మా రేవంత్ గారితో ఒక పెద్దన్న గా వ్యవహరించడి. మీరు నిలబడండి! మమ్మల్ని కూడా నిలదొక్కుకో నీయండి. కలిసి ఎదుగుదాం! ఉభయకుశలోపరి!! అంటూ ట్విట్ చేశారు.

ఆనాడు కేసీఆర్‌కు మీరెందుకు సలహా ఇవ్వలేదో :

ఘంటా చక్రపాణి ట్వీట్‌పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ‘ఘంటా చక్రపాణి గారు మీరు “మేధావులు” నాడు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లులో ఎక్కడా ఏడు మండలాలను ఏపీకి ఇవ్వాలని పొందుపరచలేదని గుర్తు చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాన మంత్రిగా ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ మండలాలను ఏపీకి ధారాదత్తం చేశారు. ఆ నాడు తెలంగాణ సీఎంగా ఈ విషయం పై కేసీఆర్ గుడ్లు అప్పగించి చూశారు.

ప్రతి చిన్న విషయానికి అగ్గి పుట్టిస్తా.. భూకంపం సృష్టిస్తా.. అని తొడలు కొట్టే కేసీఆర్.. ఏడు మండలాల విషయంలో ఏమి పుట్టించకపోగా “ఆ మండలాలు మనవి కాదు మర్చిపోండి” అని సెలవిచ్చారు. అనాడు మీలాంటి వారు “అట్లా అనడం తప్పు కేసీఆర్.. మన మండలాలు మనకు కావాల్సిందే” అని కనీసం కేసీఆర్ కు సలహా ఇచ్చి ఉండాల్సింది. ఇప్పటికైనా కేసీఆర్ అలా చేయడం తప్పు.. కేసీఆర్ మౌనం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని మీ లాంటి వాళ్లు కేసీఆర్‌ను నిలదీయాల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ ట్వీట్‌కు ఘంటా రీప్లై

తనను కార్నర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్విట్‌పై ఘంటా రీట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార హ్యాండిల్ ట్వటర్ కాదో నాకు తెలియదని, అయినా ఒక రాజకీయ పార్టీగా స్పందించినందుకు థాంక్స్ అంటునే నా ట్వీట్‌పై మీరు బుజాలు తడుముకునే అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిపని చేస్తున్నారనీ, ఆయనకు సహకరించండి అని చంద్రబాబుకు సూచిస్తే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. ముందు నా ట్వీట్ సరిగా చదవండి. నా పేరు సరిగా రాయండి. ఏడు మండలాల విషయంలో ఏం రాశానో, ఏం చెప్పానో నా ఘంటాపథంలో ఉంది.

చదవండి. కుదరకపోతే ప్రొ. కోదండరామ్‌ను అడగండి. లేదా అప్పుడు ఉద్యమంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలను అడగండి. అప్పుడు కేసీఆర్ నే కాదు, జాక్ ను కూడా నిలదీశాను. అయినా నేను కూడా అయిదు గ్రామాలే అడిగాను. అలాగే విభజన చట్టం ఎంత లోప భూయిష్టమో, ఎందుకు వ్యతిరేకించాలో మొట్టమొదట చెప్పిన వాణ్ణి. ఆనాటి ఈ వీడియో చూడండిని పేర్కోన్నారు. నేను పార్టీలు, లీడర్లకు అతీతంగా తెలంగాణా వాదిని. తెలంగాణా భావజాలం ప్రొద్దిచేసిన వాణ్ణి. ఉద్యమం నిర్మించిన వాడినని రీట్వీట్ చేశారు.