పాలమూరులో కాంగ్రెస్ కూల్.. ఒక్క జడ్చర్లలోనే అసంతృప్తి

- అధిష్ఠానం ముందు జాగ్రత్త చర్యలు
- అనిరుధ్‌కు జడ్చర్ల టికెట్‌పై పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి
- అభ్యర్థుల్లో ఇద్దరు మహిళలు
- గద్వాల, నారాయణపేటలో చాన్స్
- బీఆరెస్‌లో మహిళలకు దక్కని చోటు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవరర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల రణరంగంలోకి దింపింది. మొదటి జాబితాలో ఎనిమిది మందికి, రెండో జాబితాలో మిగిలిన ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో వారంతా ఇక ప్రచారబరిలోకి దిగనున్నారు. రెండు జాబితాల్లో జడ్చర్ల మినహా ఎక్కడా అసంతృప్తి లేదు. జడ్చర్ల ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. టికెట్ రాకపోవడంతో వేరు కుంపటికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
కాగా.. తన వర్గం నాయకులతో సమావేశం తరువాత కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తున్నది. ఇక్కడ నల్లగొండ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మద్దతుదారుడైన అనిరుధ్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకోగలిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా నిలిచినా చివరి నిమిషంలో కోమటిరెడ్డి సూచన మేరకు అధిష్ఠానం అనిరుధ్‌కు టికెట్ కేటాయించినట్లు సమాచారం. అనిరుధ్‌రెడ్డి ఇక్కడి బీఆరెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి గట్టి పోటీ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొటున్నాయి.

దేవరకద్ర అభ్యర్థిగా మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గౌని మధుసూదన్ రెడ్డిని దేవరకద్ర అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. టికెట్ ఎవరికి వచ్చినా తన మద్దతు ఉంటుందని ముందు నుంచీ ఆయన చెబుతూనే ఉన్నారు. ఇక్కడ టికెట్‌కు పెద్దగా పోటీ లేకున్నా ప్రదీప్ గౌడ్ టికెట్ ఆశించారు. నియోజకవర్గంలో ఆయనకు పెద్దగా పట్టులేదని గుర్తించిన పార్టీ అధిష్ఠానం.. మధుసూదన్ రెడ్డికే అవకాశం ఇచ్చింది. కొన్నేళ్ల నుంచి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తన సొంత క్యాడర్ నుంచి మద్దతు కూడగట్టడం కూడా మధుసూదన్ రెడ్డి వైపు కాంగ్రెస్ మొగ్గు చూపేందుకు కారణమని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో అసంతృప్తి నేతల బెడద లేకుండా అధిష్ఠానం జాగ్రత్త పడింది.
వనపర్తి.. చిన్నారెడ్డికే
దోబూచులాటల మధ్య చివరకు వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి గా మాజీ మంత్రి చిన్నారెడ్డి కే టికెట్ వరించింది. పెద్ద మందడి ఎంపీపీ మేఘారెడ్డి బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి వనపర్తి టికెట్ ఆశించారు. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహించి క్యాడర్‌ను తన వైపు తిప్పుకొన్నారు. మేఘారెడ్డి కే టికెట్ వస్తుందని అందరూ భావించారు. అయితే.. కానీ.. చిన్నారెడ్డి ఉంటేనే బీఆరెస్‌ను ఢీకొనడం సాధ్యమని భావించిన అధిష్ఠానం.. ఆయనకే టికెట్ కేటాయించిందని చెబుతున్నారు. చిన్నారెడ్డి కూడా టికెట్‌కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. మరి మంత్రి నిరంజన్‌రెడ్డిన ఏ మేరకు చిన్నారెడ్డి ఢీకొంటారో చూడాలి.

శ్రీహరికి మక్తల్
నారాయణ పేట డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరికి మక్తల్ నియోజకవర్గం టికెట్ లభించింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సీతదయాకర్ రెడ్డి ఆశించినా.. అధిష్ఠానం పట్టించుకోలేదు. వాస్తవానికి ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె టీడీపీ నుంచి ఈ మధ్య కాంగ్రెస్‌లో చేరారు. దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం సూచించినా.. ఆమె మక్తల్‌నే కోరుకున్నారు. అయినా.. వీలుకాలేదు.
ఎన్నంకే మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ అభ్యర్థి గా ఎన్నం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. ఇక్కడి టికెట్ ఆశించిన వారిలో మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబీదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, ఎన్ పి వెంకటేష్ ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్‌కు నిరాశే మిగిలింది. ఆయనతోపాటు.. కొత్వాల్, సంజీవ్ బలమైన నేతలు కాదనే భావనతో.. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి వైపే పార్టీ మొగ్గుచూపింది. ఇక్కడ బీఆరెస్ తరఫున మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. 2014లో వీరిద్దరి మధ్య రసవత్తర పోటీ జరిగింది. చివరి నిమిషంలో స్వల్ప అధిక్యతతో శ్రీనివాస్ గౌడ్ గెలుపొందారు.

రాజకీయాల్లోకి చిట్టెం వారసురాలు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మేనకోడలు చిట్టెం పర్ణికరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డి నక్సల్స్ దాడిలో చనిపోయిన విషయం తెలిసిందే. డీకే అరుణ.. నర్సిరెడ్డి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఆమె సోదరుడు వెంకటేశ్వర్‌రెడ్డి కుమార్తె పర్ణికరెడ్డి. మరో విశేషం ఏమిటంటే.. నారాయణపేట టికెట్‌ను ఆశించిన కుంభం శివకుమార్‌రెడ్డికి కూడా ఆమె మేనకోడలే. వెంకటేశ్వర్‌రెడ్డి భార్య లక్ష్మి.. శివకుమార్‌రెడ్డికి స్వయానా చెల్లెలు. వెంకటేశ్వర్‌రెడ్డి మరణం తర్వాత ఆమెకు అప్పటి ప్రభుత్వం ఆర్డీవోగా ఉద్యోగం ఇచ్చింది.

అనంతరం ఆమె ఐఏఎస్ హోదా పొంది.. ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. తాను టికెట్ ఆశించినా.. తన మేనకోడలికి టికెట్ రావడంతో కుంభం సైతం ఆమెకు మద్దతు పలికారు. ఇటు మక్తల్ నుంచి బీఆరెస్ తరఫున బరిలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి పర్ణికరెడ్డి స్వయానా తమ్ముడి కూతురు. అందులోనూ ఆమె పోటీ చేస్తున్నది కూడా పొరుగు నియోజకవర్గమే. మొత్తానికి.. జిల్లా రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన చిట్టెం నర్సిరెడ్డి కుటుంబంలో మరో తరం రాజకీయాల్లోకి వచ్చినట్టయింది. అందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. రాజకీయంగా అనుభవం లేకున్నా.. ఆమె కుటుంబానికి ఉన్న పట్టు, చిట్టెం నర్సిరెడ్డి రాజకీయ వారసత్వం నేపథ్యంలో ఆమెను నారాయణపేట అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసిందని భావిస్తున్నారు.