MLA | వేటుపడే అవకాశముంటే రాజీనామాకు సిద్ధం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కదలిక

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

MLA | వేటుపడే అవకాశముంటే రాజీనామాకు సిద్ధం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కదలిక
  • స్పీకర్ నోటీసులకు సమాధానమిచ్చేందుకు సిద్ధం
  • అసెంబ్లీ స్పీకర్ ను కలువనున్న దానం, కడియం
  • ‘సుప్రీం’ ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో కదలిక

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ ఇప్పటికే విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం నాటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా, మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. తమ వినతి మేరకు స్పీకర్ తమకు సమాధానమిచ్చేందుకు గడువు ఇచ్చినట్లూ చెబుతూ వచ్చారు. కానీ, సోమవారం సుప్రీం కోర్టు ఈ ఫిరాయింపుల వ్యవహారం పై స్పీకర్ కు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చింది.

ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పై విచారణను పూర్తి చేసి నాలుగువారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేయడంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసి నోటీసులకు సమాధానం ఇవ్వడమే కాకుండా విచారణకు హాజరుకానున్నారు. నాలుగు వారాల్లో స్పీకర్ తన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ముద్రపడిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పై వివరణ అనంతరం ఇక అనర్హత వేటు పడే అవకాశం ఏర్పడింతే, ఆ నిర్ణయానికి ముందు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని వీరు యోచిస్తున్నట్లు వీరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాజా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో వీరిలో కూడా తాము గెలుపొందుతామనే విశ్వాసం పెరిగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాకు సైతం మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.