Deputy CM Bhatti | త్వరలో రాష్ట్ర ప్రజలు, రైతాంగం శుభవార్త వింటారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రైతులు త్వరలో శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కోన్నారు.

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు, రైతులు త్వరలో శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కోన్నారు. రైతు రుణమాఫీ అమలు..త్వరలోనే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు నిలబెట్టుకోవడంలో ఒక్కో అడుగు ముందుకేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన మాట మేరకు ఆగస్టు 15వ తేదీలోగా 2లక్షల రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. గురువారం సాయంత్రం కల్లా లక్ష వరకు రుణాల మాఫీ పూర్తవుతుందన్నారు.
రుణమాఫీకి రేషన్ కార్డు లింక్‌పై ఆందోళన అవసరం లేదని, దీనిపై ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ నిమిత్తం కుటుంబ వివరాల కోసమే రేషన్ కార్డు నిబంధన తెచ్చామన్నారు. పాసుపుస్తకాలను అనుసరించి గత ప్రభుత్వాలు అమలు చేసిన రుణమాఫీ విధానాల మేరకే రైతుల రుణమాఫీ జరుగుతుందన్నారు. మొన్నటి వరకు రుణమాఫీ ఎలా చేస్తారు? నిధులు ఎలా తెస్తారని మాట్లాడిన వారు తీరా రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధం కాగానే కొత్త వాదనలు తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. ప్రోటోకాల్ విషయంలో బీఆరెస్ వాదన దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
విద్యుత్తు కమిషన్ విచారణను నిలపాలని సుప్రీంకోర్టు చెప్పలేదని, విచారణ కమిషన్ చైర్మన్ ను మాత్రమే సుప్రీంకోర్టు మార్చమని చెప్పిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పదేళ్లుగా ఉద్యోగాల భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహించకుండా సరిగ్గా ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ ఇచ్చిందని కానీ తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించామన్నారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాల భర్తీ చేశామని, డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలో మరో 6వేల పోస్టులతో మరో డీఎస్సీ వేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఏకాదశి పండుగ వేళ రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆషాడ మాసంలో పవిత్రమైన తొలి ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు