Deputy CM Bhatti | ఎవరిని చీల్చుతాడు.. ఏం చెండాడుతాడు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ రాష్ట్రం 2024-2025 వార్షిక బడ్జెట్ పై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మీడియా చిట్ చాట్‌లో స్పందించారు

బడ్జెట్‌పై కేసీఆర్ విమర్శలపై భట్టి ఫైర్
బీజేపీ చెబితేనే మాపై విమర్శలు
పూర్తిగా వినకుండానే కేసీఆర్ విమర్శలు : మంత్రి శ్రీధర్‌బాబు
విధాత : తెలంగాణ రాష్ట్రం 2024-2025 వార్షిక బడ్జెట్ పై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మీడియా చిట్ చాట్‌లో స్పందించారు. మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేసింది, అన్ని వర్గాలను మోసం చేసిందని, కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని ఇన్నాళ్లు ఆగామని.. ఇకపై కాంగ్రెస్‌ను, బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన విమర్శలపై బడ్జెట్ ప్రసంగం అనంతరం భట్టి ఆయన మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో స్పందించారు. కేసీఆర్ ఎవరనీ చీల్చుతాడు.. ఏం చెండాడుతాడని ఫైర్ అయ్యారు.
మాజీ సీఎం అయిన కేసీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడితే ఎలా అని.. పదేళ్లు మహిళలకు రుణాలు ఇవ్వలేని కేసీఆర్ ఇప్పుడు గాలి మాటలు మాట్లాడుతున్నాడని అగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవసాయానికి రూ.26 వేల కోట్లు కేటాయిస్తే.. మేం రైతుల సంక్షేమమే లక్ష్యంగా రూ.72 వేల కోట్లు పెట్టామని కౌంటర్ వేశారు. కేసీఆర్ నిన్న ఎందుకు సభకు రాలేదని, ఇంతే హడావుడిగా వెళ్లి కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదని భట్టి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం చెబితే హడావుడిగా ఈ రోజు అసెంబ్లీకి వచ్చారని, వారు చెబితేనే వెళ్లి హడావుడిగా రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేశారని విమర్శించారు. వారు మాకేంటి సమయం ఇచ్చేది..?. ప్రజలే వారికి విశ్రాంతి తీసుకోమని సమయం ఇచ్చారన్నారు.
పూర్తిగా వినకుండానే కేసీఆర్ విమర్శలు : మంత్రి శ్రీధర్‌బాబు
బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా అసెంబ్లీలో ఉండకుండా హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ విమర్శలు చేశారని, బడ్జెట్ ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్ కు అర్థమయ్యేదని మంత్రి డి.శ్రీధర్‌బాబు చురకలేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు చెప్పడంతో హడావుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, అంతే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు ఇంతే హడావుడిగా కేసీఆర్ వస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారని సెటైర్ వేశారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల ఫ్రెండ్లీ బడ్జెట్ అని అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కిందని చెప్పుకొచ్చారు.