ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల కలకలం

బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలియడం కలకలం రేపుతున్నాయి. "నీ ఏడుపే బీజేపీకి శాపం" అంటూ గుర్తుతెలియని వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారు.

విధాత, హైదరాబాద్ : బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలియడం కలకలం రేపుతున్నాయి. “నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ గుర్తుతెలియని వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారు. వాటిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు..సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు అని రాశారు.

అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల బీజేపీ పోటీ చేసే అవకాశం ఇచ్చిందని, వాటిలో ఓడిపోయినా మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇచ్చిందని, మోదీ నాయకత్వంలో గెలిచాక కూడా..నా సొంత ఇమేజ్ తోనే గెలిచాననడం ఏ రాజకీయ నైతికత ? అంటూ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు?, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ కు వస్తున్న ప్రజాదరణ చూసి కడుపు మంట ఎందుకు? అంటూ ప్లెక్సీలు, బ్యానర్లలో రాసుకొచ్చారు.

బీజేపీలో విబేధాలు లేవు..ఫ్లెక్సీలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం : రామచందర్ రావు

ఈటలకు వ్యతిరేకంగా పలుచోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అంతర్యుద్ధం, విబేధాలు లేవు అని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది అని, నేతలు ఐక్యతతో పని చేస్తున్నారు అని తెలిపారు. మా నేతల మధ్య చిచ్చు పెట్టాలని బయట వ్యక్తులు, ఇతర పార్టీల వారు ఈ కుట్రలు చేశారని, ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేసిన వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం అని రామచందర్ రావు పేర్కొన్నారు.

అటు ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ కూడా ఈటలకు వ్యతిరేకంగా వెలసిన ప్లెక్సీలు, బ్యానర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈటలకు నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని వివరణ ఇచ్చారు.

Latest News