సీఎం రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు : ఎంపీ ఈటల ఫైర్

ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలుగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.

కౌలు రైతులకు మార్కెట్ లో ధాన్యం అమ్ముకోవడానికి వీలు లేదు. భూమి యజమాని వచ్చి థంబ్ పెట్టాలి అంటున్నారు. ముంబైలో, దుబాయిలో, హైదరాబాద్ లో ఉన్న రైతు ఎలా వస్తాడు అనే సోయి ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నా అని..నీ పాలసీలు తుగ్లక్ పాలసీలుగా ఉన్నాయి,మెదడు లేని పాలసీలుగా ఉన్నాయి అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇలాంటి పద్ధతులన్నీ పక్కనపెట్టి పండించిన ప్రతి గింజ కొంటానని ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. రైతు గోస బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ లో రైతులతో ఈటల రాజేందర్, బీజేఎల్పీ లీడర్ మహేష్ రెడ్డి. ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు మాట్లాడారు. అనంతరం మీడియాతో ఈటల మాట్లాడారు.

2034 వరకు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డికి కాలం దగ్గర పడిందని, దమ్ముంటే ఇప్పుడే రాజీనామా చేయి ఎన్నికలకు రా.. నీ సంగతి ఏందో తెలుస్తుందని ఈటల సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి తొమ్మిదిన్నర ఏళ్లు పట్టింది.. కానీ నీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి మూడేళ్లే సరిపోయిందన్నారు. ఎంత పంట దిగుబడి వస్తుందని అంచనాలు లేకుండా… ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా పనిచేస్తున్నారా అని ఈటల విమర్శించారు. అంచనాలకు అనుగుణంగా బస్తాలు, హమాలీలు, లారీలు, గోదాములు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారని అన్నారు. మేము రైతులకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి వస్తే రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నా రేవంత్ రెడ్డికి దమ్ముంటే రైతుల వద్దకు రావాలని ఈటల డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎదురు దాడి మంచిది కాదన్నారు. దద్దమ్మలను ఎన్నుకొని మనం బాధపడుతున్నాం అని, చివరి గింజ కొనే వరకు రైతులకు మేము అండగా ఉంటాం అన్నారు.

ఈ యాత్రలో బీజేపీ శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, హరీష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Latest News