బీసీల‌కు 40 సీట్లు.. అమిత్‌షాకు కృత‌జ్ఞ‌త‌లు: ఈట‌ల

బీసీల‌కు 40 సీట్లు.. అమిత్‌షాకు కృత‌జ్ఞ‌త‌లు: ఈట‌ల
  • బీజేపీ కార్యాలయంలో సంబరాలు



విధాత‌: రాష్ట్రంలో బీసీల‌కు 40 సీట్ల‌కు పైగా టికెట్లు ఇవ్వాల‌ని బీజేపీ నిర్ణ‌యించింద‌ని ఆపార్టీ సీనియర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. బీసీ సీఎంను ప్ర‌క‌టించిన బీజేపీ అగ్ర నాయ‌క‌త్వానికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ శ‌నివారం రాష్ట్ర కార్యాల‌యంలో సంబురాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో డాక్ట‌ర్ బూర న‌ర్స‌య్య గౌడ్‌, ఆలె భాస్క‌ర్‌ల‌తో క‌లిసి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలోఈట‌ల మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం తప్ప వేరే వారికి సీఎం, ఆ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీని సీఎంని చేసిన చరిత్ర లేదన్నారు. ముందు ముందు ఓబీసీని సీఎం చేసే అవకాశం లేదనిచెప్పారు. బీజేపీ బీసీని సీఎం చేస్తాన‌ని ప్ర‌క‌టించింద‌న్నారు.


55 సీట్లు ప్ర‌క‌టిస్తే బీసీల‌కు 19 ఇచ్చిన చ‌రిత్ర బీజేపీదన్నారు. ఇది ఎన్నిక‌ల కోసం కాదు.. బీసీల బాగు కోసం బీజేపీ చేసింద‌న్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పోగా మిగిలిన 88 సీట్లలో 40 సీట్లకు పైన ఓబీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిద‌ని, ఇది స‌హ‌సోపేత‌మైన నిర్ణ‌యం అని అన్నారు. బీసీల రాజ్యాధికారం కల నెరవేర్చే చారిత్రాత్మక సన్నివేశాన్ని బీజేపీ ఇచ్చింద‌న్నారు. అన్ని కులాలు బీజేపీ నిర్ణయాన్ని స్వాగతించాలని కోరుతున్నామ‌న్నారు. బీజేపీ ఎలా అధికారంలోకి వ‌స్తుంద‌న్న వాళ్ల‌కు త‌మ ప్ర‌ణాళిక త‌మ‌కు ఉంటుంద‌ని తెలిపారు. శ‌శిబిష‌లు లేకుండా బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఈట‌ల‌రాజేంద‌ర్‌ కోరారు.