బీజేపీ గూటికి చేరిన గువ్వల
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు
విధాత, హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో కాషాయం జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా మారుతోందన్నారు. బాలరాజు దాన్ని గుర్తించి, ప్రధాని మోదీ బడగు, బలహీన వర్గాల ప్రజలకు, దేశ అభివృద్ధి కోసం చేస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారన్నారు. అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ బలోపేతానికి గువ్వల కృషి చేస్తారని నమ్ముతూ పార్టీలో సభ్యత్వం ఇవ్వడం జరిగిందన్నారు.
అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. తెలంగాణలో గత దశాబ్దాలుగా అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా ప్రజలను మోసం చేస్తూ, వంచిస్తూ, దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ వేదికపై ఉన్న ప్రతి కాషాయ సైనికుడు, బీజేపీ నాయకుడు, కార్యకర్త అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. నేను పార్టీలోకి రాకముందు కొంత పరిశోధన చేశాను. అప్పుడు బీజేపీ ఒక రకమైన సామాజిక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందని అనుకున్నాను. కానీ దగ్గరగా చూసిన తర్వాత తెలిసింది, కరుడు గట్టిన దేశభక్తి కలిగిన ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరీమణులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram