Pass Books | నకిలీ పాస్ పుస్తకాల ముఠా గుట్టు రట్టు
Pass Books | నకిలీ పాస్ పుస్తకాలతో లోన్‌లు కాజేస్తూ బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్న ముఠా పోలీసుల వలకుచిక్కింది.

కురవిలో ముగ్గురు అరెస్ట్, మరికొందరిపైన అనుమానం
కొందరు బ్యాంకు ఉద్యోగుల అంతర్గత ప్రమేయం?
Pass Books | విధాత, వరంగల్ ప్రతినిధి: నకిలీ పాస్ పుస్తకాలతో లోన్‌లు కాజేస్తూ బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్న ముఠా పోలీసుల వలకుచిక్కింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలో జరిగిన ఈ ముఠా గుట్టుకు సంబంధించి డిఎస్పీ తిరుపతిరావు శుర్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కురవి మండలం మచ్చాతండాకు చెందిన మూడ్ బాలాజీ, అమన్గల్ మండలం కన్నతండాకు చెందిన బానోత్ హరికిషన్, జఫర్గడ్ మండలం ఓట్లాపురానికి చెందిన బానోత్ హరికిషన్, బానోత్ వర్జన్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి ముగ్గురి వద్దనుంచి 23 నకిలీ పాస్ పుస్తకాలు, ఒక లాప్ టాప్, ఒక కంప్యూటర్, రెండు ప్రింటర్ లు, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు.
బ్యాంకుల తీరుతో విసిగిపోయి
ముగ్గురు నిందితులు లోన్ కోసం బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకు సిబ్బంది తీరుతో విసిగి వేసారిపోయారు. దీంతో వీరు కొందరి సహకారంతో నకిలీ పాస్ పుస్తకాల దందాకు తెరతీశారు. కురవి మండలంలో కొంతమంది రైతులను మభ్యపెట్టి లోన్ ఇప్పిస్తామని, దానికి ఖర్చు అవుతుంది అని చెప్పి, ఒక్కో పాస్ బుక్‌కు పదివేల రూపాయలు వసూళ్లు చేసి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారు. ఒప్పందం మేరకు నకిలీ పాస్ పుస్తకాల ద్వారా కురవి మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంకులో ఒకరికి, డోర్నకల్ యూనియన్ బ్యాంకులో ఆరుగురికి, మహబూబాబాద్ యూనియన్ బ్యాంకులో ఒకరికి, మహబూబాబాద్ కెనరా బ్యాంకులో ముగ్గురికి మొత్తం రూ.16,90,000- విలువ గల లోన్ లు ఇప్పించారు. సమాచారం తెలిసిన పోలీసులు వలవేసి అరెస్టు చేశారు. ముఠాకు చెందిన మరికొంత మంది పరారీలో లో వున్నారని ఈ సంఘటన పై పూర్తి స్థాయి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కురవి రూరల్ సీఐ సర్వయ్య, ఎస్ఐ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.