Fee Reimbursement | ప్రభుత్వంతో చర్చలు సఫలం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 600 కోట్లు విడుదల..!
Fee Reimbursement | రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల కోసం ఆందోళన చేస్తున్న ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో కాలేజీల నిరవధిక బంద్‌ను ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు విరమించుకున్నాయి.

Fee Reimbursement | హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల కోసం ఆందోళన చేస్తున్న ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో కాలేజీల నిరవధిక బంద్‌ను ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు విరమించుకున్నాయి. మొత్తం రూ. 1207 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో ప్రస్తుతం రూ. 600 కోట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మిగిలిన రూ. 600 కోట్లను దీపావళి నాటికి చెల్లిస్తామని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది.
ప్రస్తుతానికి రూ. 700 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు కోరాయి. ఇందులో రూ. 500 కోట్లు వృత్తి విద్యా కాలేజీలకు, మరో రూ. 200 కోట్లు డిగ్రీ, పీజీ కాలేజీలకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తక్షణమే రూ. 600 కోట్లు వెంటనే విడుదల చేసేందుకు అంగీకరించింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం అని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వరం లాంటిదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. 10 ఏండ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పెండింగ్‌లో పెట్టి భారంగా మార్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిన అంశాలను మేం క్రమక్రమంగా సరిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను కూడా పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ. 600 కోట్ల నిధులు ఈ వారంలోనే విడుదల చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రేషనలైజేషన్ కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించాం. తమ విజ్ఞప్తి మేరకు కాలేజీల బంద్‌ను విరమించుకున్నట్లు యాజమాన్యాలు చెప్పాయి. బంద్ విరమణకు ముందుకొచ్చిన యాజమాన్యాలకు ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.