TGSRTC | ఆర్టీసీ బ‌స్సులో ల‌గేజీ మ‌రిచిపోయారా..? ఈ ఒక్క నంబ‌ర్‌తో తిరిగి పొందొచ్చు..!

TGSRTC | ఆర్టీసీ బ‌స్సుల్లో నిత్యం ల‌క్ష‌ల మంది ప్ర‌యాణం చేస్తుంటారు. దీంతో బ‌స్సులు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసి పోతుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో అయితే నిల‌బ‌డేందుకు కూడా ప్లేస్ ఉండ‌దు. కొంద‌రు త‌మ ల‌గేజీతో ప్ర‌యాణిస్తుంటారు.

  • By: raj |    telangana |    Published on : Feb 26, 2026 7:20 AM IST
TGSRTC | ఆర్టీసీ బ‌స్సులో ల‌గేజీ మ‌రిచిపోయారా..? ఈ ఒక్క నంబ‌ర్‌తో తిరిగి పొందొచ్చు..!

TGSRTC | ఆర్టీసీ బ‌స్సుల్లో నిత్యం ల‌క్ష‌ల మంది ప్ర‌యాణం చేస్తుంటారు. దీంతో బ‌స్సులు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసి పోతుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో అయితే నిల‌బ‌డేందుకు కూడా ప్లేస్ ఉండ‌దు. కొంద‌రు త‌మ ల‌గేజీతో ప్ర‌యాణిస్తుంటారు. ర‌ద్దీ ఎక్కువగా ఉన్న స‌మ‌యాల్లో హ‌డావుడి బ‌స్సు దిగేందుకు య‌త్నిస్తుంటారు. ఇలాంటి సంద‌ర్భాల్లో ప్ర‌యాణికులు త‌మ వ‌స్తువుల‌ను, ల‌గేజీని మ‌రిచిపోతుంటారు. తీరా బ‌స్సు దిగి.. అది బ‌స్టాండ్ నుంచి వెళ్లిన త‌ర్వాత త‌మ ల‌గేజీ గుర్తుకు వ‌స్తుంది. దాంతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతుంటారు. అయితే మీరు ల‌గేజీ మ‌రిచిపోయార‌ని ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మ‌న ల‌గేజీని మ‌నం ఎంతో సులువుగా తిరిగి పొందొచ్చు.

మ‌రి ల‌గేజీ తిరిగి పొంద‌డం ఎలా..?

ఆయా ఆర్టీసీ బ‌స్సుల్లో లగేజీ, విలువైన వ‌స్తువులు మ‌రిచిపోయిన వారు వెంట‌నే త‌మ వ‌ద్ద టికెట్ ఉందా..? లేదా చెక్ చేసుకోవాలి. ఒక వేళ టికెట్ ఉన్న‌ట్ల‌యితే.. దాని మీద కండ‌క్ట‌ర్ ఐడీతో పాటు బ‌స్సు ఏ డిపోకు చెందిందో ఆ వివ‌రాలు ఉంటాయి. ఆ ఐడీ నంబ‌ర్, డిపోను గుర్తించాలి.

ఇక ఈ నెంబ‌ర్‌కు కాల్ చేస్తే చాలు..!

టీజీఎస్ ఆర్టీసీకి చెందిన‌ “040-69440000″కి ఫోన్ చేయాలి. సంబంధిత ఆర్టీసీ అధికారులు కాల్ లిఫ్ట్ చేయగానే మీరు లగేజీ మర్చిపోయిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అప్పుడు వాళ్లు మీరు ప్రయాణించిన బస్ టికెట్ మీద ఉన్న కండక్టర్ లేదా డ్రైవర్ ఐడీ చెప్పమంటారు. మీరు ఆ నంబర్ చెప్పగానే వాళ్లు దాన్ని కంప్యూటర్​లో చెక్ చేసి లగేజీ మర్చిపోయిన బస్సులో ఉన్న కండక్టర్ లేదా డ్రైవర్​కు సంబంధించిన మొబైల్ నంబర్స్ మీకు తెలియజేస్తారు.

అప్పుడు మీరు ఆ నంబర్లకు ఫోన్ చేసి బస్సులో లగేజీ మర్చిపోయిన విషయాన్ని చెప్పాలి. ఏ సీటు వద్ద మర్చిపోయారో స్పష్టంగా తెలపాలి. అప్పటికీ మీ సామాగ్రి ఎవరూ తీసుకెళ్లకుండా అక్కడే ఉంటే లగేజీని భద్రంగా మీకు అప్పగిస్తారు. ఒకవేళ బస్ దగ్గరలో ఉంటే మిమ్మల్ని అక్కడకి వచ్చి బ్యాగ్ కలెక్ట్ చేసుకోమంటారు. లేదంటే బస్సుకు దగ్గరలో ఉన్న బస్టాండ్​లో బ్యాగును జాగ్రత్తగా పెట్టి అక్కడ మిమ్మల్ని కలెక్ట్ చేసుకోమని చెబుతారు.

టికెట్ లేని సమయంలో ఏం చేయాలంటే?

ఒకవేళ మీ దగ్గర బస్సు టికెట్ లేనట్లయితే మీరు మర్చిపోయిన లగేజీ ఎవరూ తీసుకెళ్లకుంటే దాన్ని డిపోకు చేరుస్తారు. విధులు పూర్తయ్యాక బస్సు డిపోకు చేరుకునే టైమ్​లో సెక్యూరిటీ సిబ్బంది బస్సును చెక్ చేస్తారు. అప్పుడు మర్చిపోయిన వస్తువులను రికార్డులో ఎంటర్ చేసి అధికారులకు అందజేస్తారు. ఆ టైమ్​లో సదరు ప్రయాణికులు డిపోకు చేరుకుని వివరాలను తెలియజేస్తే వాటిని చెక్ చేసి డిపో మేనేజర్ సమక్షంలో తిరిగి లగేజీని అందజేస్తారు. కాబట్టి, బస్సుల్లో లగేజీ మర్చిపోయినట్లయితే టికెట్ లేని టైమ్​లో సంబంధిత డిపోలో సంప్రదించాలని సూచిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.