Hyderabad Cricket Association : హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కు హైకోర్టులో ఊరట!
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావుకు హైకోర్టులో బెయిల్ మంజూరు. అవినీతి, నిధుల దుర్వినియోగం, ఐపీఎల్ టికెట్ స్కామ్ ఆరోపణలు.

Hyderabad Cricket Association | విధాత, హైదారాబాద్ : అవినీతి ఆరోపణల కేసులో హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు రాష్ట్ర హైకోర్టులో ఊరట దక్కింది. జగన్ మోహన్ రావుకు గురువారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్షతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అరెస్టు చేసి 45 రోజులైనా సీఐడీ నిర్దిష్ట సాక్ష్యాధారాలు చూపనందున బెయిల్ మంజూరు చేసిన్నట్లుగా జస్టిస్ సృజన పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో పాటు హెచ్ సీఏ ఎన్నికల్లో 2016లో జరిగిన శ్రీచక్రా క్లబ్ ఫోర్జరీకి సంబంధించి నిర్దిష్ట ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలమైందని తెలిపారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారని సీఐడీ తెలిపింది. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ చెబుతోంది. ఐపీఎల్ టికెట్ల వివాదంలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి.
ఇటీవలే జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. వారు హెచ్ సీఏ నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, చీటింగ్ కు సంబంధించి సీఐడీ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ వారిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.