ఐనవోలు జాతరకు భారీ ఏర్పాట్లు

ఐనవోలు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఐనవోలు జాతర ఏర్పాట్లను ఆదివారం మంత్రి సమీక్షించారు

ఐనవోలు జాతరకు భారీ ఏర్పాట్లు

– సంక్రాంతి సందర్భంగా జాతర ప్రారంభం

– భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

– మంత్రి కొండా సురేఖ

– జాతర ఏర్పాట్లపై సమీక్ష

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఐనవోలు జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఐనవోలు జాతర ఏర్పాట్లను ఆదివారం మంత్రి సమీక్షించారు. అధికారుల పనితీరులో మార్పు రావాలన్నారు. జాతర ప్రాంగణంలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, గర్భిణీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జాతరలో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. అత్యవసర సేవలు అందించేందుకు మూడు అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి, కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. గతంలో నిర్వహించిన జాతర కంటే మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలోని మల్లికార్జున స్వామిని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సిక్త పట్నాయక్, వివిధ శాఖల అధికారులు దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖను పూర్ణకుంభంతో ఆలయ దేవదాయ శాఖ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఐనోవోలు జాతరపై సమీక్షించి, భక్తులకు సౌకర్యాలు, ఏర్పాట్ల పై చర్చించారు.