Green Ration cards: తెలంగాణ పేదలు.. ఇక గ్రీన్‌కార్డ్ హోల్డర్స్.. వారికి మాత్రం మూడు రంగుల కార్డులు!
రాష్ట్రంలో పేదలకు (బీపీఎల్) లబ్ధిదారులకు ఇస్తున్న గులాబీ రంగు కార్డుల స్థానే గ్రీన్ కలర్‌తో రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్య్రరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న వారికి జాతీయ జెండాలోని మూడు రంగులతో స్మార్ట్ కార్డులు ఇస్తామని వివరించారు.

Green Ration cards: రాష్ట్రంలో పేదలకు (బీపీఎల్) లబ్ధిదారులకు ఇస్తున్న గులాబీ రంగు కార్డుల స్థానే గ్రీన్ కలర్‌తో రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్య్రరేఖకు ఎగువన (ఏపీఎల్) ఉన్న వారికి జాతీయ జెండాలోని మూడు రంగులతో స్మార్ట్ కార్డులు ఇస్తామని వివరించారు. స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు మార్పులు, చేర్పులకు సునాయాసంగా ఉంటుందని, మీ సేవ లేదా పౌర సరఫరాల కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో వివరాలను నమోదు చేసుకోవడం, తొలగింపులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. స్మార్ట్ కార్డుల ముద్రణ కోసం టెండర్లు ఆహ్వానించామని, మే నెల నుంచి లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. గత దశాబ్ధకాలంగా కొత్త కార్డులు ఇవ్వడం లేదని, పాత వాటిలో కనీసం పేర్లు కూడా చేర్చలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తులు స్వీకరించి, పరిశీలన కూడా పూర్తి చేశామని తెలిపారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, పాతవారితో పాటు కొత్త లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జిల్లాల్లో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు మళ్లించడం, ఇతర దేశాలకు మళ్లించడం 70 శాతం మేర తగ్గించామన్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యానికి రూ.38 వెచ్చిస్తున్నామని, లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. సన్న బియ్యానికి అయితే రూ.48 వరకు ఖర్చవుతుందని, దీన్ని 90శాతం మంది లబ్ధిదారులను వంట చేసుకుని తింటారని అన్నారు. దొడ్డు రకం బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టంతో పాటు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. అయితే ఏపీఎల్ లబ్దిదారులకు మాత్రం ధాన్యం సేకరణ, ఖర్చు కలిపి లెక్కవేసి ధర నిర్ణయించి, వారికి కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందని, కొంత సమయం తీసుకుంటామని మంత్రి వివరించారు.
తెలంగాణ నిర్ణయంతో సన్నాల ధరలు తగ్గాయి
తెలంగాణలో సన్నాల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించడంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సన్నాలను బీపీఎల్ కార్డుదారులకు ఇవ్వాలని నిర్ణయించడంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలలో సన్న బియ్యం రేట్లు అమాంతం పడిపోయాయన్నారు. ఇక నుంచి సన్న బియ్యం గ్రీన్ రేషన్ కార్డుదారులందరికీ ఇస్తామని, దీంతో బ్లాక్ మార్కెటింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని అన్నారు. సన్నాల సాగును ప్రోత్సహించడం మూలంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దేశ చరిత్రలో తొలిసారి తెలంగాణ అత్యధిక వరి దిగుబడి సాధిస్తున్నదన్నారు. ఖరీఫ్ లో 70 లక్షల టన్నుల దొడ్డు, 80 లక్షల టన్నుల సన్నాల దిగుబడి వచ్చిందని, రబీలో రెండు కలిపి మరో 80 లక్షల టన్నుల వరి దిగుబడి వస్తుందని మంత్రి వివరించారు. దేశంలో ఇంత భారీ దిగుబడి ఏ రాష్ట్రం కూడా సాధించలేదని, భవిష్యత్తులో సాధించడం కూడా కష్టమన్నారు. దొడ్డు బియ్యానికి సబ్సిడీ ఇస్తున్న విధంగానే సన్నాలకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రిని విన్నవించగా సానుకూలంగా స్పందించి, ఎంత మంజూరు చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక పంపాలని కోరారని అన్నారు.