మంత్రి పొంగులేటి మాటలన్నీ అబద్దాలే : హరీశ్ రావు

మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలపై సమాధానం చెప్పలేకపోయారని హరీశ్ రావు ఆరోపించారు. నాదర్‌గుల్ భూములపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

Harish Rao

విధాత, హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వచ్చిన అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలపై తగిన సమాధానం చెప్పలేక మాపై తిట్ల దండకం చదివాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు ఎద్దేవా చేశారు. పొంగులేటి మంత్రిగా కాకుండా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధిగా మాట్లాడినట్లుగా ఉందని, ఆ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని, మా అధికారులను పంపి మేమే ఆ దొంగల్ని పట్టుకున్నాం.. నోటీసులు ఇచ్చినం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినప్పుడు మౌనంగా తలకాయ కిందికి వేసి ఎందుకు కూర్చున్నావ్? అని ప్రశ్నించారు.
12 రోజుల తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? అని హరీశ్ రావు నిలదీశారు. నువ్వు అడ్డంగా దొరికిపోయినవ్ పొంగు”లూటి” అని, ఇకనైనా పొగరులేటి తన పొగరు తగ్గించుకోవాలని హరీశ్ రావు సెటైర్లు వేశారు. నీ అవినీతి, అక్రమాలకు సంబంధించి చాల విషయాలు బయటపెట్టేవి ఉన్నాయన్నారు. మేం రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్ బయట పెట్టాక…దాని బోర్డు మీద రోజుకో కంపెనీ పేరు ఎందుకు మారుతుంది? అని ప్రశ్నించారు. ఆ కంపెనీలతో రాఘవ కన్స్‌ట్రక్షన్స్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నది వాస్తవమా కాదా? అని నిలదీశారు.

నాదర్‌గుల్‌లో ఉన్నది ప్రభుత్వ భూమి అని చెబుతున్న మంత్రి పొంగులేటి… మరి ఎందుకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలేదు? అని ప్రశ్నించారు. హైడ్రా ఎందుకు ఆ భూమిలోకి బుల్డోజర్ తీసుకెళ్లి ప్రైవేట్ ఆక్రమణలు తొలగించడంలేదు? అన్ని నిలదీశారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోని.. ప్రజలకు పొంగులేటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాదర్ గుల్ భూములను ప్రయత్నించేందుకు కోర్టు పరంగా, ఇతరాత్ర అన్ని ప్రయత్నాలు చేసిందని వివరించారు. ఆనాటి ఆర్డీవో అవి సీలింగ్ భూములు అని నిషేధం పెట్టారని, కోర్టు సిలింగ్ భూములని చెప్పింది వాస్తవం కాదా అన్నారు. సుప్రీంకోర్టు లో అవి గవర్నమెంట్ భూములేనని చెబితే రెండున్నరేళ్లగా ప్రభుత్వ భూమిని కాపాడకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది? రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? అని హరీశ్ రావు మండిపడ్డారు. మంత్రి పొంగులేటి తన అవినీతిని కప్పి పుచ్చుకునే క్రమంలో నేనొక్కడినే కాదు.. నా సహచర మంత్రులు కూడా అవినీతిపరులే అని తనకున్న బురదని వాళ్లకు అంటించాడని హరీశ్ రావు పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కుంభకోణం, సీఎం సోదరుల టెండర్ల స్కాం, బిల్లుల పర్సెంటేజ్ స్కాంలను తనే బయటపెట్టాడని హరీష్ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ఎల్పీజీ గ్యాస్ తో ముంబైకి చేరిన ‘గ్రీన్ ఆశా’ నౌక
ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాళ్ల టొకరా..!

Latest News