Stem Cell Lab | పేదలకు అత్యాధునిక వైద్య సేవలు.. నిమ్స్‌లో ‘స్టెమ్ సెల్’ ల్యాబ్ ప్రారంభం
Stem Cell Lab | రాష్ట్రంలోని పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.
Stem Cell Lab | హైదరాబాద్ : రాష్ట్రంలోని పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభించుకున్నాం. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ, అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నాం అని తెలిపారు.

సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక పెద్ద వృక్షానికి విత్తనం ఎంత ముఖ్యమో, మన శరీరానికి ఈ స్టెమ్ సెల్స్ అంతే ముఖ్యం. విత్తనం నుంచి మహా వృక్షం తయారు అయినట్టే, స్టెమ్ సెల్స్ నుంచి కొత్త కణాలను, అవయవాలను తయారు చేయొచ్చు. మన శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు లేదా జబ్బు చేసినప్పుడు, ఆ భాగాన్ని రిపేర్ చేసే అద్భుతమైన శక్తి ఈ కణాలకు ఉంటుంది. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి ఈ స్టెమ్ సెల్స్‌కు ఉంది. ముఖ్యంగా క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి జబ్బులతో బాధపడేవారికి ఈ చికిత్స సంజీవని లాంటిది. ఆయా వ్యాధుల వల్ల శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని మళ్ళీ కొత్తగా సృష్టించేందుకు ఈ చికిత్స ఉపయోగపడుతుంది అని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం స్టెమ్ సెల్ చికిత్స కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లోనే అందుబాటులో ఉంది. అది కూడా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకుని ఉంటుంది. సామాన్య ప్రజలకు కూడా అత్యాదునిక వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో ప్రధానంగా స్టెమ్ సెల్స్‌పై లోతైన పరిశోధనలు జరుగుతాయి. తులసి థెరప్యుటిక్స్ వారు, మన నిమ్స్ డాక్టర్లు పరిశోధనలు చేస్తారు. ఈ పరిశోధనల ఫలితంగా, భవిష్యత్తులో నిమ్స్‌లోనే పేద పేషెంట్లకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందించగలుగుతాం. త్వరలోనే ఈ ల్యాబ్ రీసెర్చ్ ఫలాలు ప్రజలకు అందుతాయని ఆశిస్తున్నానని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram