Heavy Rains In Telangana | భారీ వర్షాలున్నాయి..అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో గాలి, వర్షాలు; సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం కావాలని, జనం, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావారణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాలు, వరదల పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించాలని, రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించటంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు.
దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
గురు, శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.