Heavy Rains | తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు..!
Heavy Rains | తెలంగాణ( Telangana )లో నేటి నుంచి రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం( IMD Hyderabad ) తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఎప్పుడైనా వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Heavy Rains | హైదరాబాద్ : రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో నేడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం( Bay of Bengal ), దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం( Low Pressure ) ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో హైదరాబాద్( Hyderabad ) సహా తెలంగాణ( Telangana )లోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురవగా.. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవనుంది. ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, మహబూబ్ నగర్ లలో అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో గంటకు 8 – 10 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గి ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. మరో మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.