Site icon vidhaatha

తిరుమల, యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో జూన్ 1 నుంచి హనుమాన్ జయంతి

విధాత: తిరుమల, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రాల్లో వేసవి సెలవులు, ఆదివారం నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపుగా 24గంటలకు పైగానే సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనం భక్తులకు సైతం 3నుంచి 4గంటలు పడుతుంది. టోకెన్లున్న భక్తులకు 20 గంటల సర్వదర్శన సమయం పడుతుంది. స్వామివారిని శనివారం 83,866 మంది భక్తులు దర్శించుకోగా, 44,479 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

వేసవి సెలవులు వారాంతం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లన్ని భక్తుల రద్దీతో నిండిపోగా ఉచిత దర్శనానికి మూడు గంటలకు పైగా, ప్రత్యేక దర్శనానికి గంటన్నరకుపైగా సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, మెట్లదారులు, ప్రసాదశాల, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింద విష్ణు పుష్కరణి, పార్కింగ్, బస్టాండ్ ఏరియాలో భక్తుల రద్దీ నెలకొంది.

తిరుమలలో జూన్ 1నుంచి హనుమాన్ జయంతి

తిరుమలలలో జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు రోజులు ఆకాశ గంగలో బాలాంజనేయ స్వామి, అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతో పాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆకాశ గంగలోని అంజనాద్రి ఆలయంలో ఐదురోజుల పాటు ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు వివరించారు. తొలిరోజు మల్లెపూలతో, జూన్ 2న తమలపాకులతో, 8న ఎర్ర నేరియం, కనకాంబరం పూలతో అమ్మవారికి మహా అభిషేకం, నాల్గవ రోజు చామంతితో, చివరి రోజు సింధూరంతో అభిషేకం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

Exit mobile version