మహిళా భద్రత కోసం ‘షీ నేత్ర టీమ్స్’: సీపీ సజ్జనార్

మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్‌ పోలీసు విభాగం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. నగర కమిషనరేట్‌ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు షీ నేత్ర ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపింది. హైద‌రాబాద్ పోలీస్‌ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ ప్రత్యేక బృందాలకు కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు.

విధాత, హైదరాబాద్ : మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్‌ పోలీసు విభాగం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, విద్యా సంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య స‌ముదాయాల్లో నిఘా కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు షీ నేత్ర టీమ్స్ ను ఏర్పాటు చేసింది.

నగర కమిషనరేట్‌ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు షీ నేత్ర ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపింది. ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ల వినియోగం, తనిఖీల సమయంలో పాటించాల్సిన నిబంధనల ఎస్‌వోపీపై రెండు దశల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు.

బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హైద‌రాబాద్ పోలీస్‌ కమిషనర్ వీసీ సజ్జనర్ ఈ ప్రత్యేక బృందాలకు కెమెరా డిటెక్టర్ పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాపింగ్‌ మాల్స్‌లోని ట్రయల్‌ రూమ్‌లు, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ఏడు బృందాల ద్వారా నగరవ్యాప్తంగా ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

తమ ప్రాంగణాల్లోని ప్రైవేటు ప్రదేశాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, అజాగ్రత్తగా ఉన్నా లేదా కెమెరాలు లభ్యమైనా సంబంధిత యాజమాన్యాలపై అత్యంత కఠినమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఆయా సంస్థలను, బాధ్యులైన ఉద్యోగులను బ్లాక్ లిస్ట్ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

ప్రతి సంస్థ తప్పనిసరిగా ‘కస్టమర్ సేఫ్టీ ఇన్ చార్జీ’ని నియమించుకోవాలని, వీరు షీ టీమ్స్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించారు. వీరికి పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని, కెమెరా డిటెక్టర్లను యాజమాన్యం సమకూర్చుకోవాలని తెలిపారు. నిరంతరం తనిఖీలు చేస్తూ తమ ప్రాంగణం సురక్షితమని ధ్రువీకరించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్నారు.

మహిళల భద్రత సమిష్టి బాధ్యతని, ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులను గుర్తిస్తే వెంటనే డయల్ 100/112 లేదా షీ టీమ్స్ నంబర్ 9490616555 కు సమాచారం అందించాలని కోరారు.

 

Latest News