Danam Nagender | నేను లోకల్.. కేసులు నాకు కొత్త కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసు కేసులు నాకు కొత్త కాదని, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కాదు కదా..ఎవడు నన్నేం చేయలేడని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏవీ రంగనాథ్ కాదు కదా ఎవడు నన్నేం చేయలేడు
విధాత, హైదరాబాద్ : పోలీసు కేసులు నాకు కొత్త కాదని, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కాదు కదా..ఎవడు నన్నేం చేయలేడని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసు విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లు ఉందని, అందుకే నాపైన కేసు పెట్టాడని సెటైర్ వేశారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్ అని నన్ను ఎవడు ఏం చేయలేడని నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నందగిరిహిల్స్ హుడా లే ఔట్‌లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను అక్కడకి వెళ్లానని, హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ అని, అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అన్నారు. కేసు పెట్టిన అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తానని, వారిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రజాప్రతినిధిగా నాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదన్నారు. అంతకుముందు దానం నాగేందర్ సహా అతని అనుచరులపై జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్లో జీహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఫిర్యాద మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.