Hyderabad: నల్లాకు మోటారు పెడితే.. రూ 5 వేలు ఫైన్!

విధాత: జంటనగర వాసులకు జలమండలి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో ఎవరైనా మంచినీటి నల్లాకు మోటార్ బిగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అలా చేస్తే మోటార్ సీజ్, కనెక్షన్ కట్ తో పాటు రూ.5వేల జరిమానా విధిస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల వాటర్ సప్లయ్ సమయంలో ప్రెజర్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. నగరంలో ఈ నెల 15నుంచి టార్గెట్ మోటార్ ఫ్రీ వాటర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇంటింటికి నీటి సరఫరా సమయంలో లైన్ మెన్ నుంచి ఎండీ వరకు పర్యటించి తనిఖీ నిర్వహిస్తామని ప్రకటించారు. సిబ్బంది మోటార్ల తనిఖీ సర్వేపై నిర్లక్ష్యం వహించినా..తప్పుడు నివేదికలు ఇచ్చినా మోమోలకు ఆదేశించామన్నారు.
నీటి వినియోగంపై స్పెషల్ యాప్
అలాగే అక్రమంగా నీటిని వినియోగించుకుంటున్న వారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించినట్లుగా ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో యాప్ ను జీఎం నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. మోటార్లతో నీళ్లు వాడుతున్న వారి..నీటిని వృథా చేస్తున్న వారి ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేస్తారని తెలిపారు. అలాంటి వారి నల్లా కనెక్షన్ గుర్తించి ట్యాగ్ చేసి వెంటనే వారి నెంబర్ కు జరిమాన పడుతుందని వెల్లడించారు. జరిమానను వాటర్ బిల్లుతో కలిపి చెల్లించే విధంగా అనుసంధానించినట్లుగా తెలిపారు. నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల వాటర్ సప్లయ్ సమయంలో ప్రెజర్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.