Chukka Ramaiah : ఐఐటీ రామయ్యకు నూరేళ్లు….వెల్లువెత్తిన శత వసంతాల శుభాకాంక్షలు

ఐఐటీ కలలు నెరవేర్చిన విద్యావేత్త చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తిచేసుకున్న వేళ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. విద్యా సేవలకు ప్రసిద్ధి చెందిన రామయ్యను నేతలందరూ అభినందించారు.

Chukka Ramaiah : ఐఐటీ రామయ్యకు నూరేళ్లు….వెల్లువెత్తిన శత వసంతాల శుభాకాంక్షలు

విధాత, హైదరాబాద్ : లక్షలాది మంది విద్యార్థుల ఐఐటీ కలను నేరవేర్చి ఇంటి పేరునే ఐఐటీ రామయ్య గా మలుచుకున్న చుక్కా రామయ్య శత జన్మదినోత్సవం వేళ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వందేళ్లు దాటినా ఆ ఉత్సాహం, ఆ క్రమశిక్షణ, ఆ నిరాడంబరత్వం ఏమాత్రం చెక్కుచెదరని రామయ్య..అక్షరమే ఆయుధంగా మలిచి ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన గురవులుగా నిండు నూరేళ్ల ఆయుష్షును పూర్తి చేసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

1925 నవంబర్ 20న జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో జన్మించిన చుక్కా రామయ్య సామాజిక సంస్కర్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా నేటి తరానికి ఒక స్ఫూర్తి ప్రదాత. విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ నేపథ్యం ఆయన సొంతం. గణిత బోధనలో ఆరితేరిన రామయ్య ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో ఐఐటీ శిక్షణ ఇవ్వడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో వేల మంది విద్యార్థులను ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దడంతో కీలక భూమిక వహించారు. 2007లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరేళ్ల పాటు విద్యారంగ సమస్యలపై గళమెత్తారు. అంతేకాకుండా విద్య, సామాజిక అంశాలపై ‘చిన్న పాఠం’, ‘దేశదేశాలలో విద్య’ వంటి పుస్తకాలను రచించారు.

రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

చుక్కా రామయ్య 100వ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పలు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, విద్యానగర్ లోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య అని కొనియాడారు. విద్యా ప్రదాత కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని ఆయన అన్నారు. అలాంటి చుక్కా రామయ్య 100వ బర్త్ డే జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.