IVF Center Fraud | టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసం…కేసు నమోదు

హైదరాబాద్‌లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో మరో వ్యక్తి వీర్యకణాలతో గర్భధారణ.. డీఎన్‌ఏ పరీక్షలో మోసం బహిరంగం కావడంతో కేసు నమోదు.

IVF Center Fraud | టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసం…కేసు నమోదు

IVF Center Fraud | విధాత, హైదరాబాద్ : సంతానం కోసం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Test Tube Baby Center) ను ఆశ్రయించిన ఓ మహిళకు జరిగిన మోసం సంచలనంగా మారింది. భర్త వీర్య కణాలతో సంతానం కోరిన మహిళకు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యులు వేరే వ్యక్తి వీర్యకణాలు ఉపయోగించి ఐవీఎఫ్‌ పద్ధతిలో గర్బం దాల్చేలా చేశారు. ఆమె ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో.. వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. దంపతులిద్దరి కుటుంబాలకు క్యాన్సర్‌ చరిత్ర లేకపోవడంతో అనుమానం వచ్చి.. మరోసారి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ను ఆశ్రయించగా.. వాళ్లు పొంతనలేని సమాధానం చెప్పారు. పోలీసుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. శిశువు డీఎన్ఏ వేరే వ్యక్తికి చెందినదిగా తేలింది. దీంతో దంపతులు తమకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇందుకు కారణమైన సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో పోలీసులు తనిఖీ చేపట్టారు. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌ డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్‌, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్లలో కూడా పోలీసుల సోదాలు చేపట్టారు. సరోగసి కోసం పెద్ద ఎత్తున్న వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. దాదాపు 50మందికి పైగా వ్యక్తుల వీర్యం సేకరించి నిల్వ చేసినట్లుగా నిర్ధారించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.