Shrusti Fertility| సరోగసి కాదు.. చైల్డ్ ట్రాఫికింగ్
సరోగసి పేరుతో దంపతులను మోసం చేసిన సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణకు సంబంధించిన దర్యాప్తు వివరాలను డీసీపీ రష్మీ పెరుమాళ్, డీఎంహెచ్ వో వెంకట్ మీడియాకు వెల్లడించారు

- సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ లో కీలక విషయాలు
- వేరే దంపతుల బిడ్డను ఇచ్చి సరోగసి బిడ్డగా నమ్మించారు
- డీఎన్ఏ టెస్టుతో బట్టబయలైన మోసం
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు
- ఏడుగురి నిందితులకు 14రోజుల రిమాండ్
- 2020లోనే అనుమతుల నిలిపివేత..అయినా సెంటర్ నిర్వహణ
- డాక్టర్ నమ్రతపై రెండు రాష్ట్రాలలో 10కేసులు
- డీసీసీ రష్మీ పెరుమాళ్
విధాత, హైదరాబాద్ : సరోగసి పేరుతో దంపతులను మోసం చేసిన సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణకు సంబంధించిన దర్యాప్తు వివరాలను డీసీపీ రష్మీ పెరుమాళ్, డీఎంహెచ్ వో వెంకట్ మీడియాకు వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన దంపతులు సరోగసి ద్వారా సంతానం కోసం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రతను సంప్రదించారు. భర్త వీర్యకణాలతో సంతానం కావాలని రాజస్థాన్ మహిళ కోరింది. సరోగసి ద్వారా బిడ్డను అందించేందుకు 30లక్షలు ఖర్చు అవుతాయని నమ్రత చెప్పారు. వారిని నమ్రత బెజవాడలోని తమ సెంటర్ కు పంపించారు. అక్కడ డాక్టర్ కరుణ, సోనాలిల ఆధ్వర్యంలో వారికి పరీక్షలు నిర్వహించారు. భర్త వీర్యం శాంపిల్స్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సరోగసి(అద్దె గర్బం)కి మహిళ దొరికిందని చెప్పి విశాఖకు చెందిన ఓ మహిళను చూపించి దంపతుల నుంచి 30లక్షలు వసూలు చేశారు. కొన్నాళ్లకు మగబిడ్డను వారికి అప్పగించారు. సిజేరియన్ చేయాల్సి వచ్చిందని చెప్పి అదనంగా మరో 10లక్షలు వసూలు చేశారు. అయితే బాబు పోలికలపైన..తరుచు అనారోగ్యం పాలవుతుండటంపైన అనుమానంతో దంపతులు డాక్టర్ నమ్రతను డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరారు. అందుకు నమ్రత నిరాకరించి వారిని బెదిరించింది. తన భర్త న్యాయవాది అని చెప్పి…మీరు అక్రమంగా అనుమతులు లేకుండా సరోగసి సంతానం పొందారని..చట్టప్రకారంగా వెళితే మీపై కేసులు అవుతాయంటూ బెదిరించారు. దీంతో బాధిత దంపతులు ఢిల్లీలోని ఓ ల్యాబ్ లో డీఎన్ఏ టెస్టు చేయించగా..బాబు డీఎన్ఏ తన భర్త డీఎన్ఏ కాదని తేలింది. భర్త వీర్యకణాలకు బదులు మరొక వ్యక్తి వీర్యంతో సంతానం కలిగేలా చేసి తమను మోసం చేశారంటూ రాజస్థాన్ మహిళ సృష్టి సెంటర్ నిర్వహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపగా సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహకుల చైల్డ్ ట్రాఫికింగ్ మోసం బట్టబయలైంది.
వేరే మహిళ నుంచి బిడ్డను కొని..సరోగసిగా నమ్మించారు
ఈ కేసు విచారణ చేస్తే రాజస్థాన్ కు చెందిన మహిళకు ఆమె భర్త వీర్యం నుంచి సరోగసి ద్వారా బిడ్డను అందించకుండా ..వేరే మహిళ బిడ్డను కొనుగోలు చేసి..సరోగసి మహిళకు పుట్టిందని చెప్పి నమ్మించి ఆ బిడ్డను రాజస్థాన్ దంపతులకు అందించారని వెల్లడైందని డీసీపీ తెలిపారు. అస్సాంకు చెందిన ఓ గర్బిణి మహిళను ఢిల్లీ నుంచి విమానంలో విశాఖకు తీసుకవచ్చి డెలివరీ చేసి ఆమె బిడ్డను రాజస్థాన్ దంపతులకు సరోగసి బిడ్డ అని చెప్పి నమ్మించి ఇచ్చారని డీసీపీ వెల్లడించారు. బిడ్డను అమ్ముకున్న ఢిల్లీ మహిళకు రూ.90వేలు చెల్లించారని తెలిపారు. దీంతో ఈ కేసులో సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రతపైన, సిబ్బందిపైన చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేసినట్లుగా డీసీపీ వెల్లడించారు. నమ్రతపై ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ఐవిఎఫ్, సరోగసీ అక్రమాలకు సంబంధించి 10కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు డాక్టర్ నమ్రతతో పాటు ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా..కోర్టు 14రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. నమ్రతను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూడవచ్చన్నారు. సరోగసి కోసం వచ్చిన దంపతుల డేటాను సేకరించి విచారిస్తున్నామని తెలిపారు. సరోగసీతో పాటు చైల్డ్ ట్రాఫికింగ్ ఎప్పటి నుంచి ఎన్ని చేశారన్నదానిపై విచారణ చేస్తున్నామన్నారు.
2020లోనే మూసివేత..అక్రమంగా సెంటర్ నిర్వహణ : డీఎంహెచ్ వో
సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ ను 2020లోనే మూసివేశారని..అప్పటి నుంచి ఆ సెంటర్ కు ఎలాంటి మెడికల్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే అక్రమంగా రెండు రాష్ట్రాలలో సెంటర్ నిర్వహిస్తున్నారని డీఎంహెచ్ వో వెంకట్ తెలిపారు. సరోగసి నూతన చట్టం మేరకు సొంత కుటుంబ సభ్యులు మినహా ఇతరుల అద్దె గర్బం ద్వారా పిల్లలకు అవకాశం లేదన్నారు. అయినప్పటికి సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ నిర్వహకులు తమవద్దకు సంతానం కోసం వచ్చేవారిని మోసగిస్తున్నారని గుర్తించామన్నారు. రాజస్థాన్ దంపతుల కేసులో సరోగసీ కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందన్నారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సదానందం ఈ సెంటర్ లో అనస్థిషియా గా పనిచేస్తున్న విధానంపై వైద్య శాఖ, పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. అలాగే సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ లలో జరిపిన సోదాలలో అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి వారి నుంచి అక్రమంగా సేకరించి నిల్వ చేసిన 11 అండాలు, యువకుల నుంచి సేకరించిన 14వీర్య కణాల నిల్వలను గుర్తించినట్లుగా వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు 64మంది అండాలు, వీర్య కణాలు సేకరించారని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిందన్నారు. వాటిని వివిధ రాష్ట్రాలలోని సంతానోత్పత్తి కేంద్రాలకు పంపిస్తున్నట్లుగా గుర్తించామని..ఈ కేసులో ఇండియన్ స్పెరమాటిక్ సెంటర్ నిర్వాహకుడు పంకజ్ మోనితో పాటు ఆరుగురుని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ చేశారని తెలిపారు.