వారం రోజుల్లో కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జ్యూడిషియల్‌ విచారణ ఈ వారంలోనే మొదలు పెడతామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు

వారం రోజుల్లో కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ ప్రారంభం
  • ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • బీజేపీ, బీఆరెస్‌లు కలిసే అవినీతి చేశాయి
  • కిషన్ రెడ్డికి ఘాటు కౌంటర్‌

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఇచ్చిన మాట ప్రకారం జ్యూడిషియల్‌ విచారణ ఈ వారంలోనే మొదలు పెడతామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ సిద్దమా అంటూ చేసిన సవాల్‌పై ఉత్తమ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు సత్యదూరంగా ఉన్నాయన్నారు. అసలు బీజేపీ-బీఆరెస్‌లు కలిసి పనిచేసి, ఇరిగేషన్ పనుల్లో అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చింది కేంద్ర బీజేపీనే అని విమర్శించారు.


స్వాతంత్రం తర్వాతా సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బ్యాంకులు, రూరల్ ఎలాక్ట్రిఫిషల్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు లోన్స్ ఇప్పించిందని వెల్లడించారు. పవర్, ఇరిగేషన్ కార్పొరేషన్‌కు నిబంధనలు మార్చి బీఆరెస్‌ ప్రభుత్వానికి లోన్స్ ఇప్పించిందన్నారు. 1లక్ష 27వేల రుణాలను కార్పొరేషన్ పేరుతో కేంద్రం రాష్ట్రానికి లోన్ ఇచ్చిందని, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కే 60వేల కోట్లు లోన్స్ బీజేపీ ఇచ్చిందన్నారు. బీఆరెస్ బీజేపీలు కలిసి దోచుకుందాం అని లక్షల కోట్లు ఇచ్చారా? అని ఉత్తమ్ నిలదీశారు. మేడిగడ్డ 5 ఫీట్లు కుంగితే కనీసం కిషన్ రెడ్డి పరిశీలన చెయ్యలేదని, కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం కుంగితే ఎందుకు విజిట్ చేయలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ పై కేసీఆర్ స్పందించకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బీజేపీ, బీఆరెస్‌లు పదేళ్ల పాటు కలిసి పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 రోజుల కాలేదని అప్పుడే మాపై బురద జల్లుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టబోమన్నారు. 80వేల కోట్ల ప్రాజెక్ట్ ను 1లక్ష 27వేల కోట్లకు పెంచితే కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చిందని ఉత్తమ్ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి సీబీఐ ఈడీ అని ఏదేదో మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నాయకులపై తప్పు చేయకున్నా ఈడీ కేసులు వేసిన బీజేపీ కేసీఆర్ పై ఎందుకు వెయ్యలేదని నిలదీశారు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అనే అమిత్ షా, మోడీ, నడ్డాలు పదే పదే ఆరోపిస్తారని, మరి ఎందుకు విచారణకు అదేశించలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవిత పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పదేళ్ల పాటు లక్షల కోట్లు బీఆరెస్ వాళ్లు తిన్నారని బీజేపీ ఆరోపణ చేసిందని మరి సీబీఐ విచారణ ఎందుకు చెయ్యలేదన్నారు. మేడిగడ్డ డ్యామేజ్ పై ఖర్చు అంతా పూర్తిగా నిర్మాణ సంస్థనే భరిస్తుందన్నారు.