Kadiyam Srihari : ఉప ఎన్నికొస్తే… నేనే పోటీ చేస్తా

ఉపఎన్నిక వస్తే తానే పోటీ చేసి గెలుస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. స్పీకర్ నోటీసులకు త్వరలో సమాధానం ఇస్తానని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Kadiyam Srihari : ఉప ఎన్నికొస్తే… నేనే పోటీ చేస్తా

విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఉప ఎన్నికనేది వస్తే … తిరిగి తానే పోటీ చేస్తానని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీచేసేది తానేనని, గెలిచేది కూడా తానేనని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివద్ధి లక్ష్యంగా తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసిపనిచేస్తున్నట్లు మరోసారి వెల్లడించారు. కడియం తాజాగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసిన నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయాలని బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియంతో పాటు మరోపది మందిపై ఫిరాయింపుల ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో స్పీకర్ ఈ అనర్హత అంశం పై విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే స్పీకర్ చేపట్టిన విచారణలో భాగంగా పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఎనిమిది ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడమే కాకుండా తర్వాత క్రమంలో జరిగిన విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. కడియంతో పాటు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు మాత్రం ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. స్పీకర్ ను కలిసి గడువు కోరడంతో ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారని చెప్పారు. అయితే తాజాగా సుప్రీం ఎమ్మెల్యేల అనర్హత కేసుపై నాలుగు వారాల్లో స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించాలని మరోసారి స్పష్టం చేయడంతో కడియం స్పందించారు. మరోసారి స్పీకర్ ను శుక్రవారం కలిసి నోటీసులకు సమాధానం చెప్పేందుకు మరికొంత గడువుకావాలని కోరానని దీనికి ఆయన అంగీకరిచారన్నారు. తాను కూడా న్యాయ నిపుణులతో సంప్రదించి, తన అనుకూలురులతో చర్చించి త్వరలో స్పీకర్ కు సమాధానం చెబుతానని చెప్పారు. తన వివరణ పై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి తాను ముందుకు సాగుతానన్నారు. తన రాజీనామా పై ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఎవరెంత ఉత్సాహంగా ఉన్నా ఉప ఎన్నికలొస్తే తానే గెలుస్తానన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సహకాంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు.

ఇవి కూడా చదవండి :

Jhalkari Bai | చరిత్ర మరిచిన వీరవనిత.. నేడు ఝల్కారీ బాయి 195వ జయంతి
Harish Rao | కమీషన్ల కోసం బకాయిలు విడుదల చేయడం లేదా?.. సీఎంపై హరీశ్ రావు ఫైర్