Kavitha’s Son| కేసీఆర్ కుటుంబం నుండి మరో వారసుడి పొలిటికల్ ఎంట్రీ?
బీసీ బంద్ కు తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించి స్వయంగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవ హారం, ధర్నాలో పాల్గొన్నారు. అయితే కవితో పాటు ఆమె కొడుకు ఆదిత్య ధర్నాలో ఫ్లకార్డు పట్టుకుని రోడ్డుపై బైఠాయించడం సర్వత్రా ఆసక్తి రేపింది.

విధాత, హైదరాబాద్ : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలన్న డిమాండ్ తో బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. బీసీ బంద్ కు తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించి స్వయంగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవ హారం, ధర్నాలో పాల్గొన్నారు. అయితే కవితో పాటు ఆమె కొడుకు(Kavitha’s Son) ఆదిత్య(Aditya) ధర్నాలో ఫ్లకార్డు పట్టుకుని రోడ్డుపై బైఠాయించడం సర్వత్రా ఆసక్తి రేపింది. ఈ సందర్బంగా ఆదిత్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. కేవలం మా అమ్మ కవిత మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు అని ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలని అన్నాడు.
విదేశాల్లో చదువుకున్న కవిత కుమారుడు ఆదిత్య రాజకీయ, ప్రజాందోళన కార్యక్రమంలో కనిపించడంతో..కేసీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఆసక్తికరమైన చర్చలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు రాజకీయాల్లో కీలక బాధ్యతల్లో ఉన్నారు. కొత్తగా కవిత కొడుకు ఆదిత్య రాకతో కేసీఆర్ కుటుంబం నుంచి మరో వారసుడి రాజకీయ ఎంట్రీకి రంగం సిద్దమైనట్లుగా భావిస్తున్నారు.
కాగా బీసీ ధర్నాలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ 42శాతం రిజ్వేషన్లు కావాలని బీసీ బిడ్డలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహణతో నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు కూడా వచ్చి ఈ రోజు బంద్ లో పాల్గొనడం హంతకుడే నివాళులు అర్పించినట్టు ఉందని విమర్శించారు.