ములుగు ఆర్వీఎం నర్సింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన
సిద్ధిపేట జిల్లాలోని ములుగు ఆర్వీఎం నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు కళాశాలలో తాము ఎదుర్కోంటున్న సమస్యలపై ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ తెలంగాణ సీఎంవో దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లుగా సమాచారం

పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరిన కేరళ సీఎం
విధాత, హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలోని ములుగు ఆర్వీఎం నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు కళాశాలలో తాము ఎదుర్కోంటున్న సమస్యలపై ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్ తెలంగాణ సీఎంవో దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లుగా సమాచారం. కాలేజీలో చదువుతున్న సుమారు మంది 500 విద్యార్థుల్లో కేరళ రాష్ట్ర విద్యార్థులు కూడా మెజార్టీగా ఉన్నారు. వారి సమస్యలపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ తెలంగాణ సీఎంఓతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరినట్లుగా కథనం.
అటు ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో యాజమాన్యం, ఉన్నతాధికారులు సంప్రదింపులు చేపట్టారు. అధ్యాపక బృందం తమతో అసభ్యంగా ప్రవరిస్తున్నారంటూ ఆర్వీఎం వైద్య కళాశాల నర్సింగ్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఫోన్ అడిగితే హేళన చేస్తున్నారని, సిక్ లీవ్‌లు, సాధారణ సెలవులు ఇవ్వడం లేదని, గైర్హాజర్‌కు ఫైన్‌లు వసూలు చేస్తున్నారని, నిరసనకు దిగితే తక్కువ మార్కులు వేస్తామంటూ అధ్యాపకులు బెదిరిస్తున్నారని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. ఫోన్ పోయిందని ఫిర్యాదు చేస్తే కనీసం సీసీ టీవీ ఫుటేజీ కూడా చూసి విచారణ చేయడం లేదని, నిరంకుశంగా వ్యవహారిస్తు విద్యార్థినిలను అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆరోపించారు.