ఎక్కడున్నా సీతక్కకు ములుగు ఆలోచనే!

ములుగు జిల్లాలో వరదలపై మంత్రి సీతక్క సమీక్ష, రెడ్ అలర్ట్ జారీ. ప్రజల ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు.

ఎక్కడున్నా సీతక్కకు ములుగు ఆలోచనే!

ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ

ప్రాణనష్టం జరుగకుండా గట్టి చర్యలు

ప్రతీ వాగు, వంకల వద్ద ముందు జాగ్రత్త

జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్షించిన మంత్రి

విధాత, వరంగల్ ప్రతినిధి: ఆమె రాష్ట్రానికి ప్రధాన శాఖలు నిర్వహించే మంత్రి. అయినా ఆమె దృష్టి అంతా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ మంచి చెడులపైనే ఉంటుంది. ఆమె రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా నియోజకవర్గంలోని సమస్యలపై ఓ లుక్కేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఆదివారం చేవెళ్ల ప్రాంతంలో పర్యటిస్తూ తన ప్రయాణ సమయంలో ములుగు జిల్లాలో నెలకొన్న వరదలపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించి, తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.

ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావం నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తూ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

చెరువులు, కుంటల నీటి మట్టం, వాగులు, వంకల పరిస్థితులపై అధికారులు మంత్రికి వివరించారు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ప్రాంతాల్లో మానవ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు.

చేవెళ్ల ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, హైదరాబాద్ తిరుగు ప్రయాణం మధ్యలోనే మంత్రి సమీక్షించడం విశేషం. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని గుర్తు చేస్తూ, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ సిద్ధంగా ఉంచాలని, వరద ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగినంత ఆహారం, తాగునీరు, వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.

– ప్రతి వాగుపై పట్టున్న మంత్రి

జిల్లా భౌగోళిక పరిస్థితులపై సమగ్ర అవగాహన కలిగిన నాయకులు ప్రజాసేవలో గొప్పగా రాణిస్తారని ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు ఆ జాబితాలో మంత్రి సీతక్క కూడా నిలిచారు. తన నియోజకవర్గంలోని ప్రతి చెరువు, వాగు, తోగు, కుంటపై సంపూర్ణ అవగాహనతో, వాటి పేర్లను వేళ్లమీద లెక్కపెట్టినట్టుగా పలుకుతూ, వరద పరిస్థితులపై అధికారులు ఇచ్చిన నివేదికలను సమీక్షించి కొత్తగా వచ్చిన అధికారులను ఆశ్చర్యపరిచారు.

కొండాయి, భూటారం, జంపన్న వాగు, ప్రాజెక్ట్ నగర్ వాగు, గుండ్ల వాగు, కాల్వపల్లి… ఇలా ప్రతి వాగుల గురించి తనకు అనుభవం ఉన్న సీతక్క, అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. జంపన్న వాగు సహా ములుగు జిల్లాలోని అన్ని వాగుల పరిస్థితిపై నిశితంగా దృష్టి పెట్టి, ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను తక్షణం సురక్షిత ప్రదేశాలకు తరలించాల్సిందిగా కలెక్టర్‌తోపాటు సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. వచ్చే రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

రాత్రివేళల్లో సైతం అధికారులు విధుల్లో ఉండేలా పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రజలు వాగులు, వంకల వద్దకు వెళ్లకుండా పోలీసులు పికేటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వాగు నీటి స్థితిని గంట గంటకూ అంచనా వేసి, అవసరమైతే వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని అన్నారు. “ప్రజల ప్రాణాలకు మించినది ఏదీ లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చు” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.