కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌ల ఇళ్ల ముట్టడి
నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు శనివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని, నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌కుమార్ ఇంటిని ముట్టడించి నిరసనకు దిగాయి

నీట్ రద్దుకు విద్యార్థి సంఘాల డిమాండ్
విధాత : నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు శనివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని, నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌కుమార్ ఇంటిని ముట్టడించి నిరసనకు దిగాయి. కాచిగూడలోని కిషన్‌రెడ్డి ఇంటిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, వీజేఎస్, వైజేఎస్ విద్యార్థి నాయకులు ముట్టడించారు. ఇంటిలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్న క్రమంలో విద్యార్థులకు, వారికి మధ్య తోపులాట చోటుచేసుకున్నది.
పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ఎమ్మెల్సీ వెంకట్‌తోపాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నీట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరామని, ఆయన ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు చేస్తుంటే స్పందించకపోవడం సిగ్గుచేటని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి, నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించి 24 లక్షల విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అటు నిజామాబాద్‌లోని ఆయా విద్యార్థి సంఘాలు ఎంపీ అర్వింద్‌కుమార్ ఇంటిని ముట్టడించి నిరసన తెలిపాయి. పోలీసులు వారిని అరెస్టు చేశారు.