తుది తీర్పు వచ్చాకే స్పందిస్తా: ఎమ్మెల్సీ కోదండ రామ్

గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్, అమీర్ అలీఖాన్ ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై కోదండరామ్ స్పందించారు

తుది తీర్పు వచ్చాకే స్పందిస్తా: ఎమ్మెల్సీ కోదండ రామ్

విధాత, హైదరాబాద్ : గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్, అమీర్ అలీఖాన్ ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై కోదండరామ్ స్పందించారు. టీజేఎస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. తమ అనర్హతపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని..తుది తీర్పు వచ్చాకే దీనిపై పూర్తి స్థాయిలో స్పందిస్తానన్నారు.

ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయనిపుణులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తీర్పు వచ్చాకా తాను సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని..కలిసి దీనిపై చర్చిస్తామని తెలిపారు. ‘సామాజిక లక్ష్యాల కోసం నా ప్రయాణం పదవులతో మొదలుకాలేదు. పదవులతోనే ఆగిపోయేది కాదు. ఏదో వస్తుందని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా ప్రయాణం మొదలుపెట్టలేదు. నా లక్ష్య సాధన కోసం నా ప్రయాణం, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. జన జీవితంలో అనేక అవాంతరాలు, అడ్డంకులు, ఒడిదుడుకులు ఉంటాయి. నా ఎన్నికపై ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకోను’ అని కోదండరామ్ స్పష్టం చేశారు.